Kurnool: కర్నూలు నగరంలో మనుషుల మనసులను పిండేసే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. విధి విసిరిన ఒంటరితనపు దెబ్బకు తట్టుకోలేక ఓ కన్నతల్లి బలవన్మరణానికి పాల్పడగా.. ఏమీ ఎరగని ఆ మూడేళ్ల పసికందు రాత్రంతా ఆ మృతదేహం చెంతనే రోదిస్తూ గడిపిన తీరు చూసి స్థానికులు, పోలీసులు సైతం కంటతడి పెట్టారు.
సంసారంలో నిలవని ప్రశాంతత
ఆదోనికి చెందిన స్వాతి (30)కి నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వ్యక్తితో వివాహమైంది. వీరికి శ్రీయాన్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే మనస్పర్థలు, కుటుంబ కలహాల కారణంగా ఏడాది క్రితమే భర్తకు దూరమైన స్వాతి, కర్నూలులోని వెంకటరమణ కాలనీలో తల్లి కళావతి, కొడుకుతో కలిసి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. మూడు రోజుల క్రితం తల్లి హైదరాబాద్ వెళ్లడంతో స్వాతి ఇంట్లో కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటోంది.
రాత్రంతా శవం వద్దే పసివాడి నరకం
శుక్రవారం రాత్రి తల్లితో ఫోన్లో మాట్లాడిన స్వాతి, ఆ తర్వాత తీవ్ర మనస్తాపంతో ఫ్యానుకు ఉరేసుకుంది. తల్లి ఉరి వేసుకోవడానికి వాడిన చిన్న స్టూలు పైనే ఆ చిన్నారి శ్రీయాన్ రాత్రంతా కూర్చుండిపోయాడు. ‘అమ్మా.. లేవవేంటి?’ అని పిలుస్తూ.. వేలాడుతున్న తల్లి పాదాలను పెనవేసుకుని ముద్దులు పెడుతూ ఏడ్చి ఏడ్చి చివరికి ఆ స్టూలుపైనే స్పృహతప్పి పడిపోయాడు.
వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యం
శనివారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండవ పట్టణ పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. ఫ్యానుకు వేలాడుతున్న స్వాతి, ఆమె పాదాల కింద స్టూలుపై స్పృహతప్పి ఉన్న బాలుడు కనిపించారు. పోలీసులు కొద్దిసేపు తట్టడంతో తేరుకున్న ఆ చిన్నారిని చూసి అందరూ చలించిపోయారు. ఒంటరితనంతోనే స్వాతి ఆత్మహత్య చేసుకుందని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!