Military Survival Thriller: ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోతున్న సమయంలో ఒక హెలికాప్టర్ కూలిపోతే ? చుట్టూ తాలిబాన్ సైనికులు… సహాయం అందే పరిస్థితి లేదు. ఆ ప్రమాదం నుంచి ఒక్క సైనికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడితే ? అతడికి అక్కడ ఓ ఐదేళ్ల చిన్నారి కనిపిస్తే ? తన ప్రాణాలను కాపాడుకోవడమే కష్టమైన పరిస్థితిలో ఆ పాపను కూడా సురక్షితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అతడిపై పడితే ? శత్రువుల వేటను తప్పించుకుంటూ వందల కిలోమీటర్ల ప్రమాదకర ప్రాంతాన్ని దాటాల్సి వస్తే ? ఇలాంటి పరిస్థితుల్లో ఓ సైనికుడు, ఓ చిన్నారి మధ్య ఏర్పడే బంధం చుట్టూ సాగే ఎమోషనల్ అండ్ సీట్-ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్‌హార్స్ వన్’ (Warhorse One). మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
కథ 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోతున్న సమయంలో మొదలవుతుంది. అక్కడ చిక్కుకుపోయిన కొందరు అమెరికన్ మిషనరీలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి యుఎస్ నేవీ సీల్స్ బృందం హెలికాప్టర్ లో బయలుదేరుతుంది. కానీ మార్గమధ్యంలో తాలిబాన్ తిరుగుబాటుదారులు జరిపే దాడితో హెలికాప్టర్ కూలిపోతుంది. ఈ ప్రమాదంలో బృందంలోని సైనికులంతా ప్రాణాలు కోల్పోతారు. ఒక్క మాస్టర్ చీఫ్ రిచర్డ్ మిర్కో మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు.
గాయాలతో ఉన్నప్పటికీ మిర్కో తన మిషన్ ను పూర్తి చేయాలని ప్రయత్నిస్తాడు. తాము రక్షించాల్సిన మిషనరీల వాహనం కోసం వెతుకుతూ ముందుకు వెళ్తాడు. కానీ అక్కడికి చేరుకునేలోపే తాలిబాన్ దాడి జరిగిపోయి ఉంటుంది. ఆ దాడిలో అందరూ చనిపోయినా… ఐదేళ్ల చిన్నారి జోయ్ క్రిస్టియన్ మాత్రం ప్రాణాలతో బయటపడుతుంది. అప్పటికే మిర్కో పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. తనకు సహాయం ఎప్పుడు వస్తుందో తెలియదు. చుట్టూ శత్రువుల కదలికలు కనిపిస్తాయి. అయినా జోయ్ ను అక్కడే వదిలేసి వెళ్లలేడు. వాయుసేన నుంచి సహాయం అందే వరకు ఆ చిన్నారిని ఎలాగైనా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు.
అక్కడి నుంచి అసలు సర్వైవల్ జర్నీ మొదలవుతుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్‌లోని కఠినమైన పర్వత ప్రాంతాలు… మరోవైపు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియని శత్రువులు. మిర్కోకు ప్రతి అడుగు ప్రమాదంతో కూడుకున్నదే. ఎదురుకాల్పులు జరుగుతున్నా, గాయాలతో బాధపడుతున్నా.. జోయ్‌కు మాత్రం ధైర్యం చెబుతూనే ముందుకు సాగుతాడు. క్రమంగా సైనికుడు, చిన్నారి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. అయితే వారిని వెతుకుతున్న తాలిబాన్ దళాలు దగ్గరపడుతూనే ఉంటాయి.
మిర్కో తనను తాను కాపాడుకోవడంతో పాటు జోయ్‌ను కూడా రక్షించాలి. సహాయం వచ్చేలోపు ఈ ప్రమాదకర ప్రాంతం నుంచి బయటపడాలి. కానీ శత్రువులు చుట్టుముట్టిన పరిస్థితి నుంచి అతను ఎలా బయట పడ్డాడు ? జోయ్ ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు మిర్కో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ? చివరికి ఆ చిన్నారి ప్రాణాలను మిర్కో కాపాడగలిగాడా ? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానం సినిమా చూసినప్పుడే తెలుస్తుంది.
‘వార్‌హార్స్ వన్’ జియో హాట్‌స్టార్లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. జానీ స్ట్రాంగ్ (Johnny Strong) రిచర్డ్ మిర్కో పాత్రలో నటించిన ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు సైనికుడికి, చిన్నారికి మధ్య ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ హైలెట్ గా నిలుస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్లు, మిలిటరీ యాక్షన్ సినిమాలు వెతికే వాళ్ళు ఈ సినిమాను మిస్ అవ్వొద్దు.
Read Also: భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా