AP Weather: మొంథా తుపాను విధ్వంసం నుంచి బయటపడక ముందే వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. నవంబర్ 4 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఇది బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో ఏపీ, తెలంగాణకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది.
రానున్న మూడ్రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఇది మరింత బలహీనపడి పడుతుందని పేర్కొంది. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని అంచనా వేస్తుంది.
కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
విశాఖపట్నం ఉత్తర ప్రాంతాలలో ముఖ్యంగా భీమిలి, రుషికొండ, ఎండాడ బెల్ట్‌లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే గంటలో సీతమ్మధార, మహారాణిపేట, జగదాంబ వైపు కూడా స్వల్పంగా వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 21 మందికి కొత్త పోస్టింగ్‌లు..
రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో గాలివానలు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.