APSRTC – Sankranti : సంక్రాంతి సంబురాలకు అన్ని గ్రామాలు ముస్తాభవుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రజలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చేప్పింది.. సంక్రాంతి పర్వదినాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో 10% రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఇందుకోసం రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్ల రేట్ల తగ్గింపు భారీ ఉపశమనం కలిగించనుంది.
సంక్రాంతి రద్దీని దృష్ట్యాలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 7,200 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3,900 స్పెషల్ బస్సు సర్వీసులు నడపనుండగా.. వీటిలో హైదరాబాద్ నుంచి 2,153 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే.. బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల కోసం రెగ్యులర్ బస్సులతో పాటుగా 375 బస్సులను నడపనున్నారు.
రాష్ట్రానికి ప్రయాణికుల్ని చేర్చడమే కాదు.. పండుగ అయిపోయన తర్వాత వారిని తిరిగి వారివారి గమ్య స్థానాల్లో దింపేందుకు సైతం ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయగా.. తిరుగు ప్రయాణం కోసం సైతం 3200 ప్రత్యేక బస్స సర్వీసుల్ని కేటాయించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే.. రాయితీ కావాలనుకునే వారు రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. అలాంటి టికెట్ల ధరలపై 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.