Big Stories

Araku YCP Candidate : చల్లని అరకులో రాజకీయ వేడి.. ఆ ఇద్దరి భవిష్యత్ ఏంటి ?

araku ysrcp candidate
araku ysrcp candidate

Araku YCP Candidate : వైనాట్ 175 పేరుతో అభ్యర్థులను మార్చిపడేస్తున్న వైసీపీ.. ఐదో జాబితాలో అరకు ఎమ్మెల్యే క్యాండిటెట్స్‌ను కూడా ఛేంజ్ చేసింది. అరకు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని.. ఎమ్మెల్యేగా ప్రకటించిన వైసీపి అధిష్టానం..స్థానికత సమస్య తలెత్తటంతో ఆమె స్థానంలో.. హుకుంపేట జడ్పీటీసీ రేగం మత్స్యలింగాన్ని రంగంలోకి దించింది. అయితే.. ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే సహకారం ఎలాంటిది.. ఎంపీ గొడ్డేటి మాధవి భవిష్యత్ ఏంటి..?

- Advertisement -

నెల రోజులుగా ప్రకృతి ఒడిలో పులకరింప చేసే అరకు వ్యాలీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఏటా శీతాకాలం అరకును చలి వణికిస్తే.. ఈ ఏడాది రాజకీయాల దెబ్బకు ఆ ప్రాంతంలో హీట్‌ మొదలైంది. అరకు ప్రజల నిరసనలతో వైసీపీలో సెగ పుట్టింది. దీంతో మరోసారి పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడటం సహా ఏకంగా అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

నెల రోజుల క్రితం అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని.. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించి.. సిట్టింగ్ అయిన చెట్టి పాల్గుణకు షాక్ ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అరకు ఎమ్మెల్యే పాల్గుణ సీటు కోల్పోయారు. మార్పులు చేర్పుల్లో తనకు పాడేరు సీటు అయినా దక్కుతుందని పాల్గుణ ఆశించినా.. చివరకి ఆశాభంగం తప్పలేదు. రేగం మత్స్యలింగాన్ని వైసీపీ అధిష్టానం ఇన్‌ఛార్జ్‌గా నియమించి.. పాల్గుణకి మొండిచేయి చూపించిందంటూ ఆయన వర్గీయులే చెప్పుకుంటున్నారట.

అరకు ఎమ్మెల్యేగా గొడ్డేటి మాధవిని ప్రకటించిన రోజు నుంచి అక్కడ YCP నేతలు ఆందోళన బాట పట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ల మొదలు.. వైసీపీ క్యాడర్ అంతా మాధవిని తప్పించాలని డిమాండ్ చేశారు. దీనికోసం వారు పోరాటం కూడా చేయటంతో అధిష్టానం వెనక్కి తగ్గక తప్పలేదు. మాధవి కాకుండా.. స్థానికులు ఎవరైనా సరే తాము గెలిపించుకుంటామన్న స్థానికుల మాటలతో వైసీపీ పెద్దలు ఏకీభవించారు.

మొత్తానికి వైసీపీ అధిష్టానానికి అరకు సెగ తగిలిందని వైసీపీ నేతలే చెబుతున్నారు. వైసీపీ ప్రకటించిన ఐదోలిస్టులో అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవిని మార్చి హుకుంపేట జడ్పీటీసీ రేగం మత్స్యలింగానికి అవకాశం కల్పించారు. మార్పు మంచిదే అయినా… వైసీపీ అధిష్టానం మాత్రం.. మాధవిపై ఉన్న వ్యతిరేకత తొలగించటం సహా ప్రతిపక్షం నిలబెట్టే వ్యక్తికి ధీటైన వ్యక్తిగా మత్స్యలింగం ఉంటారని భావించే.. నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

ఇప్పటికే అరకు టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్, ఎమ్మెల్యే అభ్యర్దిగా దొన్ను దొర సియ్యారిని.. చంద్రబాబు ప్రకటించారు. కొండదొర సామాజిక వర్గానికి చెందిన దొన్ను దొర సియ్యారి.. 2019లో TDP టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్‌ను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచారు. ఈ లెక్కలను అంచనా వేసుకునే.. టీడీపీ.. దొన్నుదొరకు టిక్కెట్ కన్ఫామ్ చేసిందనే గుసగుసలూ ఉన్నాయి. దీంతో బలమైన అభ్యర్థి కోసం చూసి.. టీడీపీకి పోటీగా అదే సామాజికి వర్గానికి చెందిన మత్స్యలింగంకు అవకాశం కల్పించింది.

రేగం మత్స్యలింగం స్థానికుడు కావడంతో పాటు కొండ దొర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతని ఎంపికపైన స్థానిక నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణ కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పాల్గుణ.. సీటు కోల్పోయినా అధిష్టానంకు మరోసారి పరిశీలించాలని చెప్పారట. అంతేగానీ.. పార్టీపై గానీ.. అధినేతపై కానీ విమర్శలు చేయలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత ప్రజలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణపైనా వ్యతిరేకత రావటంతో.. పాల్గుణ ఆ నిర్ణయం తీసుకున్నారని టాక్‌. ఓ రకంగా చెప్పాలంటూ.. ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగాన్ని.. పాల్గుణనే సూచించినట్లు తెలుస్తుంది. గతంలో ఇద్దరూ కలసి పనిచేసిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనే పాల్గుణ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మత్స్యలింగం గెలిస్తే.. నియోజకవర్గంలో తన పరపతికి ఎలాంటి డోకా ఉండదని భావించినట్లు తెలుస్తుంది. స్థానికుడికి ఇస్తేనే సహకారం అందిస్తామని చెప్పిన వైసీపీ నాయకులు, కార్యకర్తల సపోర్ట్‌కు.. సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణ మద్దతు కూడా దక్కడంతో మత్స్యలింగం కొంత వరకూ సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఉండి.. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందు సీటు పొందిన గొడ్డేటి మాధవి మాత్రం..వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికురాలు కాకపోవడం, ఐదేళ్లు ఎంపీగా ఉన్న కనీసం అరకులో క్యాంపు కార్యాలయం కూడా ఓపెన్ చేయకపోవడంతో స్థానికుల దగ్గర తీవ్రమైన వ్యతిరేకతను మాధవి మూటగట్టుకున్నారనే ఆరోపణ ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ జరగకపోవటం, ఎంపీ భర్త జోక్యం ఎక్కువ కావడం కూడా మాధవికి ఇబ్బంది తీసుకొచ్చిందనే వార్తలూ ఉన్నాయి. వైసీపీ అధిష్టానం నుంచి.. తనకు స్పష్టమైన హామీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రశాంతమైన అరకు వ్యాలీ ఇప్పడు రాజకీయ వాతావరణంలో వేడెక్కింది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News