Army Jawan Murali Naik: ఆపరేషన్ సిందూర్‌లో తెలుగుబిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో భరతమాత రక్షణ కోసం పోరాడుతూ మురళీ నాయక్ అనే సోల్జర్ నేలకొరిగాడు. ఎక్కడో మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీనాయక్.. తానుజవాను కావాలన్నది చిన్నప్పటి కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. చివరకు అనుకున్నది సాధించి.. సరిహద్దులో మంచుకొండల్లో దేశ రక్షణలో భాగమయ్యాడు.
మురళీ నాయక్ స్వగ్రామం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. అతని తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి. వీరు రోజువారి కూలీలు. అయితే మురళికి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ. అందుకే అతనికి రైల్వేలో ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నారు. ఎంతో ఇష్టంతో ఆర్మీలో చేరారు. 2022 డిసెంబరు 29న గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీర్‌గా సెలెక్ట్ అయ్యారు. మొదట పంజాబ్, అస్సాంలలో పనిచేశారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ సరిహద్దులో 851 లైట్ రెజిమెంట్ యూనిట్‌లో అగ్నివీర్‌గా పనిచేస్తున్నారు.
తల్లిదండ్రులకు మురళి ఏకైక సంతానం. అతన్ని ఉన్నత స్థాయిలో చూడాలని మురళి తల్లి ఆశించారు. ఇందుకోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధమై పనుల కోసం ముంబయికి వెళ్లారు. అక్కడ తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా, తల్లి ఇళ్లలో పనులు చేస్తున్నారు. అయితే మురళిని నాగినాయని చెరువు తండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. మురళి పదో తరగతి వరకు సోమందేపల్లిలో, ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు.
అగ్నివీర్‌లో మురళినాయక్ ప్రస్తుతం రెండున్నరేళ్ల సర్వీసు పూర్తి అయింది. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని తల్లిదండ్రులు కలలుకన్నారు. అటు స్వగ్రామంలో కళ్లితండాలో మే 6వ తేదీన జాతర జరిగింది. ఈ జాతరలో పాల్గొనడానికి మురళి తల్లిదండ్రులు ముంబయి నుంచి వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఆనందంగా గడిపారు. కానీ ఇంతలో ఆపరేషన్ సిందూర్‌లో మురళి వీరమరణం గురించి తెలిసి దుఖఃసాగరంలో మునిగిపోయారు. గారాబంగా పెంచుకున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు మురళి తల్లిదండ్రులు. అతడి మరణవార్తతో ఇక తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు.. కంటతడి పెట్టిస్తోంది. ఇక మురళి వీరమరణంతో స్వగ్రామం కళ్లితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులతో పాటు మురళి నాయక్ స్నేహితులు కూడా తీవ్ర భావోద్వానికి లోనయ్యారు. వారు మాట్లాడుతూ.. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కూడా తన ఫ్రెండ్ మురళీ నాయక్ మోటివేట్ చేయడంతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, తాను కూడా అందరిలాగే ఉద్యోగం సాధించాడంటే దానికి కారణం మురళీ నాయక్.. నన్ను బ్రతికించి తాను చనిపోయాడు.. అంటూ అతని ఫ్రెండ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తను చనిపోతానని ముందే తెలిసి తన స్నేహితుడికి కాల్ చేసి, తల్లి దండ్రుల గురించి బాధ్యతను అప్పగించి, మురళీ నాయక్ యుద్ధంలో పాల్గొన్నారని వారి స్నేహితులు చెబుతున్నారు.
Also Read: బ్రేకింగ్.. పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు స్వగ్రామం కళ్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో రేపు జరగనున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివ దేహం రానుంది. 7 గంటలకు గుమ్మయగారిపల్లి గ్రామం నుండి ర్యాలీ బయలుదేరనుంది. రాత్రి 10 గంటలకు మురళీ ఇంటికి భౌతిక కాయం చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మురళీనాయక్ తల్లిదండ్రులను ఏపీ మంత్రి సవిత ఓదార్చారు. తనవంతు సాయంగా 5 లక్షల చెక్కు అందజేశారు. తండ్రి శ్రీరాంనాయక్ కోరిక మేరకు యువతకు స్ఫూర్తినిచ్చేలా తండాలోని వారి సొంత పొలంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఇక మురళినాయక్‌ను కడసారి చూసేందుకు గ్రామస్థులు, చుట్టుప్రక్కల ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.