Ayodhya Ram Mandir: విశాఖ బీచ్ రోడ్డులో అయోధ్య రామ మందిరం రిప్లిక నిర్మాణంలో.. నిర్వాహకుడి మోసాలు వెలుగు చూస్తున్నాయి. మొదట ఇది భక్తి, ఆధ్యాత్మికత పేరుతో ప్రజలను ఆకర్షించినా, ఇప్పుడు ఈ నిర్మాణం వెనుక అసలు కథ వెలుగులోకి వస్తోంది. భక్తి పేరుతో వేలాది మంది భక్తులను ఆకర్షించి.. కోట్లల్లో డబ్బులు వసూలు చేసిన సంఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతుల వెనక దోపిడీ డ్రామా
ఈ రామ మందిర రిప్లిక నిర్మాణానికి.. తుని ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ నేతృత్వం వహించాడు. ఇతడు ముంబైకి చెందిన పెట్టుబడిదారుడు పీవీ శెట్టితో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాడు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఇది కేవలం తాత్కాలిక సెట్టింగ్ మాత్రమే. ఆగస్టు 4 వరకు కేవలం పోలీసు అనుమతి మాత్రమే ఉంది. కానీ దుర్గాప్రసాద్ అనుమతులన్నీ తీసుకున్నానని చెప్పి, రిప్లిక ఆలయ నిర్మాణం పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశాడు.
ప్రజలను మోసం చేసిన విధానం
ఈ ఆలయాన్ని చూసేందుకు రోజూ వేలాది మంది వచ్చి టికెట్లు తీసుకోవాల్సి ఉండేది. సమాచారం ప్రకారం, గత 3 నెలల్లో కోట్లల్లో టికెట్లు విక్రయించి, వేలాది మంది భక్తులను మోసం చేశారు. అదేవిధంగా, ఆలయ నిర్మాణం కోసం ఏలేశ్వరానికి చెందిన గణేష్ అనే వ్యక్తి దగ్గర రూ. 32 లక్షలు వసూలు చేశారు. ఇది ఆలయ నిర్మాణానికి అని చెప్పి, ఆ డబ్బులను పూర్తిగా వేరే లెక్కలకు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.
ఫోటో డిప్లొమసీ.. అధికారుల పేరుతో మాయ
దుర్గాప్రసాద్ కేవలం డబ్బులే కాదు, ప్రభుత్వ అధికారులతో దిగిన ఫోటోలను చూపించి, తాను ప్రభుత్వ అనుమతులతో పని చేస్తున్నానంటూ ప్రజలను నమ్మించాడు. ముఖ్యంగా విశాఖ సీపీతో దిగిన ఫోటోను చూపిస్తూ .. అన్నీ శాఖల అనుమతులు ఉన్నాయంటూ ప్రచారం చేశాడు. అంతే కాదు, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఫోటోలతో కూడిన పెద్ద గ్యాలరీ తయారు చేసి, తన ప్రాజెక్టుకు లెగిటిమసీ తీసుకొచ్చాడు.
రాజకీయ మద్దతు కోసం ప్రయత్నాలు
విశాఖలో తన ప్రాజెక్టు సక్సెస్ అయ్యిందనే నమ్మకంతో, దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో కూడా అయోధ్య రామ మందిరం.. సెట్టింగ్ పెట్టే యత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం. కిషన్ రెడ్డితో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.
మోసపోయిన భక్తులు – నిఘాలో పోలీసులు
ఈ వ్యవహారంపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు. మోసపోయిన భక్తులు, చందాదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో, విచారణ వేగంగా సాగుతోంది. అనుమతుల నిబంధనలు, వసూలు చేసిన డబ్బుల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు అన్నింటినీ పోలీసులు స్కాన్ చేస్తున్నారు. పలు శాఖల అనుమతులు లేకుండా.. ఎలా ఈ స్థాయి ప్రాజెక్టు జరిగిందనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
Also Read: నరికేస్తాం అంటే.. చేతులు కట్టుకోం, వైసీపీపై పవన్ హాట్ కామెంట్స్
భక్తి పేరుతో జరుగుతున్న మోసాలను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆలయాలు చూసేందుకు వెళ్తున్నప్పుడు, అక్కడ జరుగుతున్న లావాదేవీలను, టికెట్ ధరలను, అనుమతుల వివరాలను తెలుసుకోవడం కీలకం. లేకపోతే, ఆధ్యాత్మికత ముసుగులో మాయదారి వ్యాపారాలకు బలైపోవాల్సి వస్తుంది.