Korean Romantic Series: యవ్వనంలో పిచ్చిగా ప్రేమించుకున్నారు. చిన్న చిన్న కారణాలతో విడిపోయారు. మళ్లీ కలిశారు… కానీ విధి మరోసారి వాళ్లను దూరం చేసింది. అలా ఒకటికి రెండుసార్లు బ్రేకప్ చెప్పుకున్న ఇద్దరు ప్రేమికులు పదేళ్ల తర్వాత అనుకోకుండా ఎదురెదురుగా నిలబడితే ? అప్పటికే అతను జర్నలిస్ట్… ఆమె ఓ వివాదాస్పద వ్యాపారవేత్త భార్య. పాత ప్రేమ మళ్లీ చిగురిస్తే పరిస్థితులు ఎలా మారతాయి ? ఈసారి అయినా వాళ్ల ప్రేమకు గెలిచే అవకాశం దొరుకుతుందా ? ఇలాంటి భావోద్వేగమైన కథతో తెరకెక్కిన కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామానే ‘ష్యూర్లీ టుమారో’ (Surely Tomorrow). మరి ఈ కొరియన్ డ్రామా తెలుగులో ఏ ఓటీటీలో ఉందంటే ?
లీ క్యోంగ్-దో, సియో జి-వూ ఇద్దరూ తమ 20 ఏళ్ల వయసులో గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే చిన్న చిన్న మనస్పర్థలు, అప్పటి పరిస్థితుల కారణంగా వాళ్ల బంధం ఎక్కువ కాలం నిలవదు. ఒకసారి విడిపోయిన తర్వాత మళ్లీ కలిసినా… విధి వాళ్లకు ఇంకో పరీక్ష పెడుతుంది. అలా తమ 20లలోనే రెండుసార్లు బ్రేకప్ చెప్పుకుని పూర్తిగా దూరమైపోతారు. కాలం గడిచిపోతుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఇద్దరూ జీవితంలో మరో దశకు చేరుకుంటారు. క్యోంగ్-దో ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థలో ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ గా పని చేస్తుంటాడు. జి-వూ మాత్రం ఓ సంపన్న కుటుంబానికి చెందిన వివాదాస్పద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఉంటుంది.
అలాంటి సమయంలో క్యోంగ్-దోకు ఒక సంచలనమైన అసైన్‌మెంట్ వస్తుంది. ఓ పెద్ద ధనిక కుటుంబంలో చోటుచేసుకున్న వివాహేతర సంబంధానికి సంబంధించిన స్కాండల్ ను అతను దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతడికి ఊహించని నిజం తెలుస్తుంది. ఆ వివాదంలో చిక్కుకున్న వ్యాపారవేత్త భార్య మరెవరో కాదు… తన జీవితంలో ఒకప్పుడు అత్యంత ప్రేమించిన జి-వూనే అని తెలుసుకుంటాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.
పదేళ్ల తర్వాత ఎదురుపడిన ఇద్దరి మధ్య పాత జ్ఞాపకాలు మళ్లీ కదులుతాయి. జి-వూను కాపాడేందుకు క్యోంగ్-దో చేసే ప్రయత్నాల్లో అతని పాత ప్రేమ కూడా మళ్లీ బయటపడుతుంది. అయితే ఇప్పుడు వాళ్లు యువకులు కాదు. జీవితాన్ని చూసిన ఇద్దరు మెచ్యూర్ వ్యక్తులు. అందుకే ఈసారి ప్రేమతో పాటు బాధ్యతలు, గత గాయాలు, సామాజిక పరిస్థితులు కూడా వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అసలు గతంలో ఎందుకు విడిపోయారు ? అప్పట్లో చేసిన తప్పులు ఏమిటి ? ఇప్పుడు జి-వూ ఎదుర్కొంటున్న సమస్యల వెనుక అసలు నిజం ఏంటి ? ఈ రెండో అవకాశం వారి ప్రేమను నిజంగా గమ్యానికి చేర్చుతుందా లేదా ? అనేదే సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం.
‘ష్యూర్లీ టుమారో’ (Surely Tomorrow) ప్రస్తుతం భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు తెలుగు ఆడియో డబ్బింగ్ అందుబాటులో ఉంది. మొత్తం 12 ఎపిసోడ్‌లతో తెరకెక్కిన ఈ కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామాలో పార్క్ సెయో-జూన్, వాన్ జి-అన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెండుసార్లు విడిపోయిన ప్రేమికులకు జీవితం మూడో అవకాశం ఇస్తే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్‌తో సాగుతుంది కాబట్టి… ఎమోషనల్ లవ్ స్టోరీస్, కొరియన్ డ్రామాలు ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ఆప్షన్.
Read Also: ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్