MLA Vishnu Kumar on YCP: ఆయన బీజేపీ ఎమ్మేల్యే. అయితేనేమి మాటలు మాత్రం కాస్త వైసీపీకి అనుకూలంగా ఉంటాయని అప్పట్లో ప్రచారం జోరుగా ఉండేది. ఇప్పుడు మాత్రం అది కరెక్ట్ అనే రీతిలో ఎమ్మేల్యే తన వాక్కు వినిపించారంటూ ప్రచారం జోరందుకుంది. ఇంతకు ఆ ఎమ్మేల్యే ఎవరో తెలుసా.. ఏపీకి చెందిన విశాఖ పట్టణం ఉత్తర నియోజకవర్గ ఎమ్మేల్యే విష్ణుకుమార్‌రాజు.
ఏపీలో ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి, మస్తాన్ రావులు సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో పార్టీలో చేరారు.
కృష్ణయ్య మాత్రం కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ రాజ్యసభ ఉపఎన్నికలు వచ్చేశాయి. ఈ తరుణంలో కృష్ణయ్య ను బీజేపీ తరపున మళ్లీ రాజ్యసభకు పంపించేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే బీద మస్తాన్ రావును టీడీపీ నుండి రాజ్యసభకు పంపేందుకు ఆ పార్టీ సిద్దమైంది. కానీ మోపిదేవి వెంకట రమణ మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నారు.
ఇలా వీరు పార్టీలు మారి, మళ్లీ రాజ్యసభ సీట్లను దక్కించుకోవడంపై ఎమ్మేల్యే విష్ణు కుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని వీడడం అనైతికమని, జగన్ నమ్మి వాళ్లకి రాజ్యసభ పదవులు ఇచ్చారని, వీరు ఇలా రాజీనామాలు చేసి పార్టీలు మారడం కరెక్ట్ కాదన్నారు.
పార్టీ మారిన వారిలో ఒకరు మా పార్టీలోనే చేరారని, ఒక పదవికి రాజీనామా చేసి.. మళ్లీ అదే పదవి కోసం మరో పార్టీలో చేరడం సరికాదన్నారు. సాంకేతికంగా వారి రాజీనామాలు సరైనవే కావొచ్చు నైతికంగా అది మంచి పద్ధతి కాదంటూ కుండబద్దలు కొట్టారు. ఈ మాటలు వైసీపీకి అనుకూలంగా మారాయని, సోషల్ మీడియా కోడై కూస్తోంది. బీజేపీ ఎమ్మేల్యే అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో విష్ణు కుమార్ రాజు తన నైజం మార్చుకోరని కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు కొందరు.
Also Read: AP Pension Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా పింఛన్ నగదు..
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ గురించి ఈ ఎమ్మేల్యేనే మాట్లాడుతూ.. తనకు జగన్ కు దోస్తీ ఉందని అందరూ ప్రచారం చేస్తుంటారని, దోస్తీ లేదు.. అది లేదంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇప్పుడు మాత్రం కాస్త వైసీపీకి అనుకూలంగా కామెంట్స్ చేయడంతో, అది నిజమేనా అంటూ వైరల్ అవుతోంది. ఏదిఏమైనా తన వ్యక్తిగత అభిప్రాయమో ఏమో కానీ, ఎమ్మేల్యే విష్ణుకుమార్‌రాజు చేసిన కామెంట్స్ మాత్రం పొలిటికల్ టాపిక్ గా మారాయి. చివరగా కొసమెరుపు ఏమిటంటే వైసీపీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తమ పార్టీలోకి వస్తానంటే సాదర స్వాగతం పలికేందుకు తాను సిద్దమని కూడా విష్ణుకుమార్‌రాజు చెప్పారు.