AP Pension Scheme: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒకేసారి పింఛన్ పెంచి నగదు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల సమావేశంలో తన నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే కొత్త కార్యాచరణకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని కూడా సీఎం ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సామాజిక పింఛన్లను కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచడంతో పాటు, మూడు నెలలకు వెయ్యి చొప్పున కూడా అదనంగా కలిపి వృధ్యాప్య పింఛన్ ను పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగులకు కూడా పింఛన్ ను రూ. 6000 అందజేశారు. అయితే వాలంటీర్లు లేరు కాబట్టి పింఛన్ పంపిణీ ఎలా అనుకుంటున్న సమయంలో సచివాలయ సిబ్బంది చేత, నగదు పంపిణీ చేసి ప్రభుత్వం మన్ననలు పొందింది.
ఇలా సామాజిక పింఛన్ల విషయంలో పక్కాగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో తల్లీదండ్రులు లేని చిన్నారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఒంటరి చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉండాలన్న ఉద్దేశంతో, సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఒంటరి చిన్నారులు ఉన్నట్లు అధికారిక లెక్క ఉండగా, మరో 3 నెలల్లో పక్కా సమాచారంను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం ఆదేశించారు.
ఈ నిర్ణయంతో తల్లీదండ్రులు లేని చిన్నారులకు ఆర్థిక సాయం అందుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మానవాతావాదులు, స్వచ్చంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరూ లేక దిక్కు తోచని స్థితిలో గల చిన్నారులకు ప్రభుత్వం సాయం అందించే ప్రక్రియకు పూనుకోవడం హర్షించదగ్గ విషయమని నెటిజన్స్ కూడా ప్రభుత్వానికి తమ మద్దతు పలుకుతున్నారు. మరి మీ దృష్టిలో కూడా ఇలాంటి చిన్నారులు ఉంటే, వారికి కూడా ప్రభుత్వం చేపట్టబోయే కొత్త నిర్ణయాన్ని తెలిపి, భరోసా కల్పించండి. ఈ సంధర్భంగా సీఎం చంద్రబాబుకు నెటిజన్స్.. థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.