EPF : ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ కు సంబంధించి వచ్చే ఏడాది కీలక మార్పులు చోటు చేసుకునున్నాయి. ఇకపై ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణను తేలిక చేస్తూ కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం ద్వారా ఈపీఎఫ్ ను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండనుందని తెలిపింది.
ఈపీఎఫ్ కు సంబంధించి 2025లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఐటీ సిస్టమ్స్ ఆప్ గ్రేడింగ్ ప్రక్రియ మొదలైందని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు. అయితే ఇంతకీ ఏటీఎంతో ఈపీఎఫ్ ఎట్లా పనిచేస్తుంది.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం.
ఇప్పటికీ ఈపీఎఫ్ ఆన్లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అవసరమైన సందర్భాల్లో గరిష్టంగా 90 శాతం వరకు నిధులను ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇంటి నిర్మాణం, పిల్లల చదువులు, వివాహం, వైద్య ఖర్చులు వంటి సందర్భాల్లో ఈపీఎఫ్ ను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన క్లైమ్ రిక్వెస్ట్ పెడితే బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. అయితే గతంతో పోలిస్తే క్లైమ్ సెటిల్మెంట్ లో జాప్యం తగ్గినప్పటికీ వెంటనే కావాలనుకుంటే మాత్రం ఈ ఫండ్ ను తీసుకునే అవకాశం ఉండదు. అందుకే ఏటీఎం విత్ డ్రా సదుపాయాన్ని తీసుకురాబోతుంది కేంద్రం.
ఈ ప్రక్రియలో ఏటీఎం ద్వారా నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక డెబిట్ కార్డుల తరహాలో పిఎఫ్ కార్డులు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. లేదంటే పీఎఫ్ ఖాతాకు బ్యాంక్ ఎకౌంట్ ను అనుసంధానం చేసే డెబిట్ కార్డ్ సైతం ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కార్డు ద్వారా పీఎఫ్ ను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం ఇప్పటివరకు రాలేదు. ఇక మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ లో 50% వరకు మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది.
నిజానికి పీఎఫ్ ను ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకొనే అవకాశం ఉంటే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ పై అవగాహన లేని వారికి సైతం పీఎఫ్ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలుపుతున్నారు. అత్యవసర సమయాల్లో ఈ నిధులు ఉపయోగపడతాయని, ఏటీఎం ద్వారా తేలికగా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొస్తున్నారు.
ఇక ఏది ఏమైనా… ఈ సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు కేంద్రం తెలపడంతో ఉద్యోగస్తులకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు ఎప్పుడు చేతికి వస్తాయో తెలియనట్టు ఉన్న ఉద్యోగస్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి 2025లో ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయో స్పష్టత లేనప్పటికీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తాయని మాత్రం తెలుస్తోంది.
ALSO READ : శాటిలైట్ కనెక్షన్ తో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఎప్పటినుంచి రానుందంటే!