Vizianagaram: ఏపీలోని వైసీపీలో ఏం జరిగింది? ఎందుకు నేతలు పార్టీని విడిచి పెట్టిపోతున్నారు? కేసులకు భయపడిపోతున్నారా? అధికారంలోకి రావడం కష్టమని నేతలు డిసైడ్ అయ్యారు? ఈ క్రమంలో ఎవరికి దారి వారు చూసుకుంటున్నారా? సాయిరెడ్డి వ్యాఖ్యలు, మేనల్లుడి వ్యవహారం నేపథ్యంలో బొత్స కంటతడి పెట్టారా? ఇవే ప్రశ్నలు ఆయన్ని వెంటాడుతున్నాయి.
వైసీపీలో అంతర్గత లుకలుకలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల మీడియా ముందుకొచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బొత్స ఎన్ని పార్టీలు మారారు? ఆయన గత చరిత్ర ఏంటి? విజయమ్మను నానా మాటలు అన్నారని, ఆరోపించిన సంగతి తెల్సిందే.
వైసీపీ గురించి గతంలో బొత్స ఏం మాట్లాడారు? అనేది అందరికీ తెలుసని చురకలంటించారు. ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గురువారం సొంత నియోజకవర్గం గరివిడిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు.
ఆయన మాటలను ఖండించడానికి రాలేదని, కేవలం రాజశేఖర్ రెడ్డి మృతి సమయంలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా ఉదాహరించారు. ఘటన జరిగిన రోజు కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి నాలుగు గంటలకు ఆయన మృతదేహాన్ని కర్నూలు నుంచి హైదరాబాద్ రప్పించామన్నారు. తన వెనకాలే రాజశేఖర్ మృతదేహం తీసుకొచ్చారన్నారు.
పదవుల కోసం ఇలాంటి నీచమైన రాజకీయాలకు దిగజారుతారని ఆలోచించలేదన్నారు. గుండెల్లో ఎన్నో విషయాలు ఉన్నాయని, నీ గురించి, పార్టీ గురించి నోరు మెదపలేదన్నారు. కొజ్జా రాజకీయాల కోసం ఈ స్థాయికి దిగజారుతారా? అంటూ మండిపడ్డారు. నీకు దమ్ముంటే రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేయాలని సవాల్ విసిరారు.
ALSO READ: ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్
అదే సమయంలో మేనల్లుడి శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పార్టీ మార్పుపై కూడా స్పందించారు. రాజకీయాల్లో మనిషి స్వార్థం ఉంటుందని, మనుషులు వస్తూ ఉంటారని, పోతూ ఉంటారని అన్నారు. పార్టీ మాత్రం శాశ్వతమన్నారు. ఇలాంటివి తమకు కొత్తమీ కాదని తేల్చేశారు. కొన్నాళ్లుగా బొత్స-మేనల్లుడు చిన్న శ్రీను మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
వైసీపీలో మేనల్లుడి ప్రాధాన్యం తగ్గించేలా బొత్స ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బొత్స తన కూతుర్ని రాజకీయాల్లోకి రప్పించడంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ విషయాన్ని శ్రీను బయట పెట్టలేదు. ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు చిన్న శ్రీను. ఎందుకంటే పేరుకే బొత్స గానీ.. తెర వెనుక రాజకీయాలు నడిపించేది శ్రీను.