TDP BC Strategy:2029 ఎన్నికలపై టీడీపి ఇప్పటి నుండే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది.ఇందులో భాగంగానే తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభని నిర్వహించింది.
ఈ సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీసీల సంక్షేమం గురించి అలాగే రాజకీయాలలో బీసీల చైతన్యం గురించి , గత వైసీపీ ప్రభుత్వంలో బీసీల విషయంలో జగన్ తీరుపై మండిపడ్డారు.రాబోయే రోజుల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని నాయకులు స్పష్టం చేశారు.
బీసీ నాయకులపై అక్రమ కేసులు
ఇక సభలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలు ఇప్పటి నుంచే రాజకీయంగా, సామాజికంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి 2029ని ఒక మైలురాయిగా గుర్తుపెట్టుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, ఆస్తులను నాశనం చేస్తూ రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాల్లో దాదాపు 80 కులాలకు ఇప్పటివరకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కలేదని, అలాంటి వర్గాలకు కూటమి ప్రభుత్వంలో రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీసీ మహిళ రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఈ దిశగా వేసిన మొదటి అడుగు అని ఆయన తెలిపారు.
అలాగే, గ్రామ స్థాయి నుంచి బీసీ నాయకత్వాన్ని బయటకి తీసిన ఘనత ఎన్టీఆర్ దేనని, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ ల అభివృద్దికి టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు.
బీసీల ఎదుగుదలలో కీలక పాత్ర
ఇక మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బీసీల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది టీడీపేనని గుర్తుచేశారు. జగన్ పాలనలో బీసీ నాయకులను భయపెట్టాలని చూసినా, బీసీల రక్తంలోనే ‘పసుపు’ ఉందంటూ ఫైర్ అయారు.
వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రతిపక్షాలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని, ప్రజలు ఎవరు మంచి వారో గుర్తించాలని కోరారు.
ఇక మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచి బీసీ యువతకు మేలు చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు నానాయాగీ చేస్తున్నాయని విమర్శించారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందనను గుర్తుచేస్తూ, చివరికి నిజమే గెలిచిందని అన్నారు.
వచ్చే ఎన్నికలకి ఇప్పుడే రంగం సిద్దం
ముఖ్యంగా జగన్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని ,అందుకే బీసీలంతా టీడీపీ, కూటమికి సపోర్ట్ చేయాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. 2029లో ప్రజలు తీసుకునే నిర్ణయం కేవలం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మాత్రమే కాదని, రాబోయే తరాల భవిష్యత్తును తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశమని తెలిపారు.
మొత్తంగా చూస్తుంటే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడో మూడేళ్లకి వచ్చే ఎన్నికలకి ఇప్పుడే రంగం సిద్దమైనట్టు కనిపిస్తుంది.
ALSO READ:చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?