Chandrababu Arrest Anniversary:అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత సమక్షంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి, చంద్రబాబు అరెస్ట్ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజున అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఆ కష్టకాలంలో ఆయనకు కొండంత అండగా నిలిచిన ప్రజలకు, అభిమానులకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆమె విమర్శించారు. చంద్రబాబు నీతి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని రకాలుగా వేధించినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాటం సాగించారని ఆకాశానికి ఎత్తేశారు.
ఆ సమయంలో చంద్రబాబును ఏకంగా 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచడం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘట్టమని అన్నారు. ఆయన అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లోని తెలుగువారు కూడా ఆవేదన వ్యక్తం చేసి పెద్ద ఎత్తున నిరసనలకు దిగారని తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టి చంద్రబాబుకు తమ పూర్తి మద్దతుని తెలియజేశారని గుర్తుచేశారు.
ప్రజల నుంచి వచ్చిన స్పందన మరియు టీడీపీ శ్రేణులు చేపట్టిన పోరాటాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయని అన్నారు. కోర్టుల్లో జరిగిన విచారణల ద్వారా చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని తేలిపోయిందని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని స్పష్టం చేశారు.
గత జగన్ ప్రభుత్వం చేసిన కక్షసాధింపు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు సాధారణ ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్యంలో కేసులు, అరెస్టులతో వేధించే సంస్కృతికి అస్సలు చోటు ఉండకూడదని, రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే నిజమైన నాయకత్వమని తన అభిప్రాయాన్ని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి ఎంతో మంది సపోర్ట్ చేయడానికి ఆయనపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణమని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం, ఆయన రాజకీయ ప్రయాణంలో సాధించిన అభివృద్ధిపై ఉన్న నమ్మకమే ప్రతి ఒక్కరినీ రోడ్డుపైకి వచ్చి పోరాడేలా చేసిందని వివరించారు.
ప్రస్తుతం అకూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు రాజధాని అమరావతి నిర్మాణం అనే ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోందని మంత్రి సవిత ప్రకటించారు. గతంలో జరిగిన అన్యాయాలు, ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.
ALSO READ:జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?
తాడేపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఆనాటి కష్టమైన పరిస్థితులని ప్రజల నుంచి వచ్చిన సపోర్ట్ ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.