Tirupati District: ఎండాకాలం మాదిరిగా బస్సులు-లారీల్లో అగ్నిప్రమాద మంటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో ఓ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో 19 మంది ఉన్నారు. డ్రైవర్-క్లీనర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగింది?
తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాచపాళెం చెరువు కల్వర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. బాపట్ల నుంచి బెంగుళూరుకు వెళ్తోంది ఓ ట్రావెల్ కి చెందిన బస్సు. తెల్లవారుజామున NH-16పై రెండు గంటల సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు మొదలయ్యాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు అంతటా వ్యాపించాయి. మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్.. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించివేశారు. వెంటనే ఘటన గురించి ఫైర్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అప్పటికే బస్సు దాదాపు దగ్దమైనట్టు తెలుస్తోంది.
ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు అధికారులు. బస్సు నెంబరు AR 01 S 6404 కాగా, ఘటన సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు ప్రయాణికులు. ఈ ఘటన గురించి తెలియగానే ప్రయాణికుల బంధువులు పదే పదే అధికారులకు ఫోన్ చేసి ఏమైందంటూ కనుక్కోవడం మొదలుపెట్టారు.
ALSO READ: బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!