
Dastagiri: వివేకా హత్య కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఎంపీ అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రేపోమాపో అరెస్ట్ అంటూ మళ్లీ ప్రచారం జరుగుతోంది. ముందస్తు బెయిల్ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో.. సీబీఐ అధికారులు పులివెందుల వెళ్లారు. అదే సమయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా పులివెందులలోని తన ఇంటికి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు సీబీఐ, ఇటు అవినాష్.. పులివెందులలో హైటెన్షన్ కొనసాగుతోంది.
మరోవైపు, సీబీఐ సిబ్బంది పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లడం ఆసక్తికర పరిణామం. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి ఇస్తున్న భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు వెంటనే చెప్పాలని దస్తగిరికి సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సీబీఐ హెచ్చరించింది.
తనకు ప్రాణహాని ఉందంటూ, అదనపు భద్రత కల్పించాలంటూ ఇటీవల జిల్లా ఎస్పీని కోరాడు దస్తగిరి. వెంటనే స్పందించిన ఎస్సీ.. దస్తగిరికి సెక్యూరిటీని 1+5కి పెంచారు. అయినా, అవినాష్ అనుచరుల నుంచి తనకు ప్రమాదం పొంచిఉందని ఆరోపిస్తున్నారు దస్తగిరి. అటు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు దిశగా పరిణామాలు వేగంగా మారుతుండటంతో.. ఆయన అరెస్ట్ అయితే ఆ కోపంలో అతని అనుచరులు దస్తగిరిపై అటాక్ చేసే అవకాశం ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. తాజాగా, సీబీఐ అధికారులు సైతం దస్తగిరిని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది.