AP CEC Tour: ఏపీలో తర్వలో ఎన్నికల నగరా మోగనుంది. దీంతో ఎలక్షన్ల నిర్వహణపై ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు రాష్ట్రంలో పర్యటిస్తున్న ఈసీ బృందం కీలక సమావేశాలతో బిజీ అయింది. ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలతోపాటు.. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించగా.. ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతోనూ.. ఆ తర్వాత సీఎస్, డీజీపీ, అధికారులతోనూ సమావేశం కానుంది.
ఇవాళ రెండో రోజు ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తోంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో మీనా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఈ సమీక్షలో మద్యం, నగదు అక్రమ రవాణా అరికట్టడంపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్, డీజీపీ, అధికారులతోనూ కేంద్ర ఎన్నికల బృందం సమావేశం కానుంది.
మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీ నేతలతో ఈసీ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించింది. ఆ తర్వాత జిల్లాల అధికారులతో సమావేశమైంది. ఈ భేటీలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, అనంతపురం ఆఫీసర్లపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గ స్థాయి అధికారులను కూడా నిలదీసింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే పని అయితే విధుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని అధికారులందరి గురించిన రిపోర్ట్ తమ దగ్గర ఉందన్న ఈసీ.. ఏ అధికారి ఎలాంటి వారో తెలియదని అనుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది.