Weather Alert: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లని కబురు అందించింది. 13 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నందున ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చెదురుముదురు గాలులతో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర ప్రజలను హెచ్చరించింది.
ద్రోణి ప్రభావంతో.. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వర్ష సూచన చేసింది. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఆకస్మిక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఏపీలో వర్షపాతం దారుణంగా పడిపోయింది. అయితే నిన్న (మంగళవారం) మాత్రం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు పెరికగూడెంలో 31.3 మి.మీ., పెంటపాడులో 27.6 మి.మీ. చందర్లపాడు – పండ్రపాడులో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవాళ కూడా వర్షం పడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!
మరోవైపు తెలంగాణలోనూ నేడు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను సైతం హైదరాబాద్ వాతావరణం కేంద్రం జారీ చేసింది.
Also Read: అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ