Rama Nandana:రెండు రోజులుగా మీడియాలో వైరల్ అవుతున్న యూట్యూబర్ రమా నందనను డెస్టినీ కన్సల్టెన్సీ కేసులో రమా నందనను ఇబ్రహీంపట్నం పోలీసులు విచారించారు. గంటల పాటు జరిగిన ప్రశ్నల తర్వాత విచారణ ముగిసింది. అయితే తనకు ఈ వ్యవహారం గురించి పెద్దగా తెలియదని, అంతా తన భర్త మధుకర్ చూసుకునేవారని రమా నందనా చెప్పినట్లు సమాచారం.
విచారణ అనంతరం రమా నందనకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించారు. కేసులో కొన్ని అంశాలపై మరింత సమాచారం అవసరమని పోలీసులు చెబుతున్నారు.
అద్దంకి పోలీసులు కూడా
ఇదే సమయంలో అద్దంకి పోలీసులు కూడా రమా నందనకు నోటీసులు ఇవ్వడానికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే స్టేషన్‌లో నోటీసులు తీసుకోకపోవడం గమనార్హం. తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వాలని పోలీసులకు చెప్పడంతో వారు ఆమె నివాసానికి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఇక ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రమా నందనను విచారించామని, డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలు మధుకర్ చూసేవారని ఆమె చెప్పిందన్నారు. అయితే విచారణలో పూర్తిస్థాయిలో సహకరించలేదని తెలిపారు. అందుకే 16వ తేదీన మరోసారి రావాలని నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.
కేసులో ఆమె పేరు ఉండటంతోనే
రమా నందనపై ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదు లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ కేసులో ఆమె పేరు ఉండటంతో విచారణకు పిలిచినట్లు తెలిపారు. మరోవైపు అద్దంకి పరిధిలో కూడా కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు సమాచారం.
ఇప్పుడు అందరి దృష్టి 16వ తేదీ విచారణపైనే ఉంది. ఆ రోజు రమా నందనా హాజరవుతారా? పోలీసుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తారు? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. కేసు దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.
అసలు విషయానికి వస్తే
ఇక రమా నందన విషయానికి వస్తే యూకేలో ఉద్యోగం, వీసా రెన్యువల్, Certificate of Sponsorship (CoS) ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారంటూ బాధితులు ఆమెపై అలాగే ఆమె భర్త జాగర్లమూడి మధుకర్‌పై ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.బాధితులలో ఒకతను ఏకంగా రూ.15 లక్షలపైగా ఇచ్చాడని సమాచారం.దీంతో రమా నందన, ఆమె భర్త, మధుకర్ తండ్రి పేర్లపై కేస్ ఫైల్ చేసిన పోలీసులు Look Out Circular (LOC) జారీ చేశారు.
ALSO READ:జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్
ఇక సెప్టెంబర్ 7న రమా నందన యూకే నుంచి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.ఈ క్రమంలోనే సెప్టెంబర్ 8న ఆమె న్యాయవాదులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విచారణకు హాజరయ్యారు.