Chandrababu Fired on Jagan Over Pension Distribution: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మేనిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరించారు. పెన్షన్ల విషయంపై జగన్ పై మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. జగన్ మాత్రం పెన్షన్ ను 2028 నాటికి రూ. 250 పెంచుతాడంటా.. ఇప్పుడు చెప్పండి పేదల పెన్నిది ఎవరూ అనేది.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4 వేలు ఇస్తామంటున్న తామా..? లేక రూ. 250 పెంచుకుంటూ పోతామంటున్న జగనా..? అని చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ ఎప్పుడూ కూడా పేదల పక్షానే ఉంటదన్నారు.
ప్రస్తుతం ఏపీలో పెన్షన్ తీసుకునేందుకు వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.. ఒక్కో ఉద్యోగి కనీసం 40 మంది వృద్ధులకు వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే అవకాశముంది.. కానీ, వాళ్ల ఇంటికి దగ్గర ఇవ్వకుండా వారిని ఎండలో సచివాలయాలకు తిప్పుతున్నాడు.. అక్కడ కూడా ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ జగన్ పై మండిపడ్డారు. ఎంత దుర్మార్గం ఇది.. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇంటి వద్ద వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు వేశాడని.. ఆ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం వృద్ధులకు తెలుసా అంటూ జగన్ పై మండిపడ్డారు. పాపం వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు.. వృద్ధులు పడే క్షోభను తాను చూశానని.. వారి ఉసురు మీకు తగులుతుందంటూ ఆయన అన్నారు.
Also Read: ఇది మీకు తగునా..? సీఎస్ కు చంద్రబాబు లేఖ
ఇప్పటికైనా ప్రజలు గమనించాలి.. వాస్తవాలు గ్రహించి తమకు ఓటు వేసి గెలిపించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పెన్షన్ కూడా ఇంటి వద్దకే వచ్చి ఇచ్చే బాధ్యత తనదన్నారు. మీ పెద్ద కొడుకుగా నేనుంటా.. 1వ తేదీన మీ ఇంటి వద్దకే వచ్చి రూ. 4 వేల పెన్షన్ ఇచ్చే బాధ్యత తనదేనన్నారు.
ఇదిలా ఉంటే వృద్ధుల పెన్షన్ చెల్లింపు విషయమై సీఎస్ కు చంద్రబాబు లేఖ రాసిన విషయం విధితమే. పెన్షన్ దారులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. పెన్షన్ కోసం పెన్షన్ దారులు మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒక్క రోజులోనే పెన్షన్ ను ఇంటి వద్దనే ఇచ్చి పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేంత వ్యవస్థ గ్రామస్థాయిలో ఉన్నదని.. అయినా కూడా అలా ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని.. దీంతో ప్రజలు ఎండలో ఇబ్బందిపడుతున్నారని అందులో పేర్కన్నారు.