Chandrababu : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు దూకుడు పెంచారు. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వరుసగా పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించారు. అక్కడే రోడ్ షో నిర్వహించి.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ ..ఏపీని గంజాయి రాజధానిగా చేశారని మండిపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన జగన్.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు మరోసారి అన్నారు.
జగన్ పాలనలో ప్రజలకు కష్టాలు, బాధలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. నిత్యావసరాల ధరలు, బస్సు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. చెత్త మీద కూడా పన్ను వేసిన ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరన్నారు. వైసీపీ ఆరిపోయే దీపమని.. గడువు తేదీ దగ్గర పడిందని స్పష్టం చేశారు. సంక్షేమం పేరుతో సీఎం బటన్ నొక్కుతున్నానంటూ నిధులను బొక్కుతున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రూ.2 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారని చంద్రబాబు ఆరోపించారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ.2 లక్షల చొప్పున రుణభారం మోపారన్నారు. ఆ అప్పులన్నీ ఎవరు కట్టాలి? అని నిలదీశారు. విద్యావసతికి డబ్బుల్లేవని, ఉద్యోగులకు జీతాలు, పోలీసులకు డీఏలు ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని సరిచేస్తానని హామీ ఇచ్చారు. వివేకానంద హత్య కేసులో అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
జగన్ విశాఖకు వస్తానంటే ప్రజలు వణికిపోతున్నారని అన్నారు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు. పులివెందులలో బస్టాండ్ కట్టలేని సీఎం 3 రాజధానులు నిర్మిస్తారా అని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.