Amaravati Outer Ring Road: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం దిశగా అడుగులు ముందుకేస్తోంది చంద్రబాబు సర్కార్. భూసేకరణ కోసం ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను నియమించింది. వీటిలో కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. మొత్తం 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా అవుటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వెళ్లనుంది. 189.9 కిలోమీటర్ల నిడివిలో భూసేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఏపీ రాజధాని అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంతంతోపాటు బయట కలిపి మొత్తం ఐదు జిల్లాల పరిధిలో ఉండనుంది ఈ రింగ్ రోడ్డు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు తమ డివిజన్ల ప్రాతిపదికన భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించటానికి ఐదు జిల్లాలకు సంబంధించి సంయుక్త కలెక్టర్లును నియమించింది. కొద్ది రోజుల్లో ఐదు జిల్లాల వారీగా భూసేకరణకు నోటిఫికేషన్లను వెలువరించనున్నారు. కృష్ణా జిల్లాలో 4 మండలాల పరిధిలో ఏలూరు జిల్లాలో ఒక మండలం, ఎన్టీఆర్ జిల్లాలో 5 మండలాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాలు, పల్నాడు జిల్లాలో రెండు మండలాలు దీని పరిధిలోకి రానున్నాయి. ఆయా మండలాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వెళ్లనుంది.
ఓఆర్‌ఆర్‌లో కృష్ణానదిపై రెండు బ్రిడ్జిలు, 34 చోట్ల హై ఓల్టేజీ క్రాసింగులు, మూడు టన్నెళ్లు, ఏడు ఆర్‌ఓబీలు,78 అండర్ పాస్ లు, 51 చిన్న వంతెనలు, 14 పెద్ద వంతెనలు, తొమ్మిది ఇంటర్ చేంజ్‌లు రానున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ హైవేను నిర్మించనున్నారు. ఫ్యూచర్‌లో రద్దీ పెరిగతే 8 వరుసలుగా దీన్ని విస్తరించే అవకాశముంది.
ALSO READ: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులు
ఓఆర్ఆర్ భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. 21 రోజుల తర్వాత అభ్యంతరాలు తెలిపిన వారితో జాయింట్ కలెక్టర్లు సమావేశాలు నిర్వహించనున్నారు. వాటిని జేసీ, జాతీయ రహదారుల సంస్థ స్థాయిలో పరిష్కరిస్తారు. ఈ ప్రాసెస్ పూర్తి తర్వాత సర్వే చేసి మార్కింగ్ వేయనున్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే జేసీ వద్ద పరిష్కారం అవుతాయి. అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం.
ఆ తర్వాత సేకరించిన భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లనున్నాయి. చివరకు భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలను ఎన్‌హెచ్ఏఐకి పంపిస్తారు. ఆ నిధులను భూమి యజమానులకు ఆన్‌లైన్‌లో చెల్లిస్తారు. ఆ తర్వాత భూములను మ్యుటేషన్ చేస్తారు. ఈ క్రమంలో డీపీఆర్ సిద్ధం కావడం, ఆ తర్వాత అనుమతులను ఎన్‌హెచ్ఏఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు. ఈ ప్రాసెస్ జరిగేందుకు చాలా రోజులు పట్టవచ్చు.
రాజధాని అమరావతి కోసం భూములు సేకరించామని కాబట్టి, రింగు రోడ్డు కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వం వర్గాల ఆలోచన. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు వస్తే చుట్టు పక్కల భూముల ధరలు అమాంతంగా పెరుగుతాయి. మిగతా భూముల విలువ కోట్లలో పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఐదు జిల్లాల పరిధిలోని ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూడాలి.