సింగపూర్ పర్యటనలో భాగంగా రెండోరోజు.. అక్కడి టువాస్ పోర్ట్ ని సందర్శించారు సీఎం చంద్రబాబు. ఆయనతోపాటు మంత్రులు లోకేష్, టీజీ భరత్ ఇతర అధికారులు ఉన్నారు. ఏపీ పోర్టులను సింగపూర్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈమేరకు సింగపూర్ అధికారులతో కూడా ఏపీ బృందం సమాలోచనలు జరిపింది.
పోర్ట్ సందర్శన
రెండో రోజు పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు బృందం సందర్శించింది. పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సింగపూర్ లోని టువాస్ పోర్ట్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ ఇక్కడ నిర్మిస్తున్నారు. అంతే కాదు, ఈ పోర్ట్ లో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కార్గో హ్యాండ్లింగ్ చేపడుతున్నారు. టువాస్ పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ సీఎం చంద్రబాబుని విపరీతంగా ఆకర్షించింది. ఏఐ టెక్నాలజీతో పనిచేస్తున్న ఆటోమేషన్ వ్యవస్థను ఆయన పరిశీలించారు. ఏపీ పోర్టుల్లో కూడా ఆపరేషన్స్, కార్గో హ్యాండ్లింగ్ తదితర అంశాల్లో ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలనుకుంటోంది.
ఆధునిక టెక్నాలజీ
ఏపీలో మరిన్ని పోర్టుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగా నిర్మించే పోర్టుల్లో ముందుగానే ఆధునిక టెక్నాలజీని ప్రవేశ పెట్టాలనుకుంటున్నారు. దీనికోసం టువాస్ పోర్టు ఆపరేషన్స్ ని వారు దగ్గరుండి పరిశీలించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్న దశలో.. టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు మనకు ఎంత వరకు ఉపయోగపడాతాయనే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు.
సింగపూర్ మంత్రితో భేటీ
రెండోరోజు పర్యటనలో సీఎం చంద్రబాబు సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో కూడా భేటీ అయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో సందిగ్ధత ఎదురైంది. ఆ సమయంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పరిష్కరించే దిశగా ఇప్పుడు చర్చలు జరిగాయి. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని సీఎం చంద్రబాబు చెప్పడం గమనార్హం. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్‌ను చంద్రబాబు కోరారు.
తన సింగపూర్ పర్యటనలో రెండవ రోజు సింగపూర్ మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు గారు సమావేశమయ్యారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు.… pic.twitter.com/lajlQIpyff
— Telugu Desam Party (@JaiTDP) July 28, 2025
హెచ్ఆర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్య రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, పోర్టులతోపాటు మరిన్ని రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కూడా ఆయన అక్కడి ప్రతినిధులను కోరారు. ఏపీలో పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో అభివృద్ధికి సింగపూర్ సహకరించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రతిపాదనలకు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ సానుకూలత వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ, సబ్ సీ కేబుల్ రంగం, గృహ నిర్మాణ రంగంలో ఏపీతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.