మిస్సమ్మ కడుపులో పిండాన్ని చంపేయడానికి పూజలు చేస్తుంది చంభా. చంభా ఎన్ని పూజలు చేసినా మిస్సమ్మకు ఏమీ కాదు. దీంతో చంభా నిజం తెలుసుకోవడానికి అంజనం వేసి చేస్తుంది. అందులో నిజానిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు తెలుసుకున్న చంభా భయంతో వణికిపోతుంది. ఇక భాగీ కడుపులో పిండాన్ని చంపడం అంత తేలిక కాదు అని తెలుసుకుని పూజలు ఆపేస్తుంది. వెంటనే రణవీర్ కు విషయం చెప్తుంది.
రణవీర్ కూడా భయంతో నేను ముందే చెప్పాను.. అయినా ఆ మనోహరే వినడం లేదు.. అన్ని వదిలేసి కోల్‌కతా రమ్మన్నాను అయినా మొండిగా ఇక్కడే ఉంటానంటుంది. తన కర్మ తాను అనుభవిస్తే తప్పా మనోహరికి బుద్ది రాదులే చంభా అంటాడు రణవీర్. అయితే ఈ విషయం మనోహరికి చెప్పడానికి చంభా అమర్ ఇంటికి వెళ్తా అంటుంది. అందుకు రణవీర్ ఒప్పుకోడు.. మనోహరికి ఫోన్‌లో చెప్పొచ్చు కదా..? నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు. అయినా చంభా వినకుండా మనోహరి కి విషయం చెప్పడానికి అమర్ ఇంటికి వెళ్తుంది.
అమర్ ఇంటి దగ్గర చంభా ఫోన్ కోసం ఎదురు చూస్తున్న మనోహరి.. ఏవేవో ఊహల్లో తేలిపోతుంది. ఈ పాటికే చంభా పూజ పూర్తి అయి ఉంటుంది. భాగీ కి కొద్ది గంటల్లోనే అబార్షన్ అవుతుంది. భాగీకి అబార్షన్ అయ్యాక దాన్ని ఎలాగైనా అమర్ దగ్గర ఇరికించేసి అమర్ దృష్టిలో భాగీని పిచ్చి దాన్ని చేయాలి తర్వాత ఎలాగైనా భాగీని చంపేసి ఎంచక్కా అమర్‌ను పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటూ ఊహల్లో తేలిపోతుంది.
ఇంతలో అక్కడికి చంభా వస్తుంది. చంభాను చూసిన మనోహరి సంతోషంగా ఏం చంభా పూజ పూర్తి చేశావా..? ఎప్పుడు భాగీకి అబార్షన్ అవుతుంది. చెప్పు చంభా ఏంటి మౌనంగా ఉన్నావు.. చెప్పు చంభా అని అడగ్గానే.. చంభా భయంగా భాగీకి అబార్షన్ అయ్యేలా చేయడం అంత సులువు కాదు మనోహరి.. నేను ఎంత నిష్టగా పూజ చేసినా కూడా భాగీ కడుపులో పిండాన్ని ఏమీ చేయలేకపోయాను.. నా శక్తులన్నీ ఉపయోగించాను కానీ ఆ పిండాన్ని నా శక్తులు టచ్ కూడా చేయలేకపోయాయి. భాగీ కడుపులో ఉన్నది చాలా గట్టి పిండం మనోహరి. ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి అంటూ హెచ్చరించడంతో మనోహరి భయపడుతుంది.
ఏంటి చంభా నువ్వు చెప్పేది అంటూ వణుకుతూ అడుగుతుంది. దీంతో అవును మనోహరి నేను చెప్పేది నిజం.. భయంకరమైన నిజం.. కంసుడి పాలిట కృష్ణుడు మృత్యువు అయినట్టు.. నీ పాలిట భాగీకి పుట్టబోయే బిడ్డ మృత్యువు కాబోతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి.. ఎప్పుడైతే భాగీ కడుపులో ఆ బిడ్డ పడిందో అప్పుడే నీ పతనం కూడా మొదలైంది మనోహరి.. అంటూ చంభా చెప్తుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది. అసలు భాగీకి పుట్టే బిడ్డ నాకెందుకు మృత్యువు అవుతుంది..? అంటూ భయపడుతుంది.
ఇంతలో మిస్సమ్మ పై నుంచి కిందకు వస్తుంది. మనోహరి రూం దగ్గరకు వెళ్లి డోర్ దగ్గర నిలబడి చంభా, మనోహరి మాట్లాడుకోవడం వింటుంది. మనోహరి భయంగా నువ్వు చెప్పింది విన్నాక నాకొకటి అర్తం అయింది. భాగీ కడుపులో పిండం పెరిగే కొద్దీ నాకు ఆయుష్సు తగ్గిపోతుంది అన్నమాట అంటుంది. దీంతో చంభా సరిగ్గా చెప్పావు ఆ పిండాన్ని అవతల వేస్తేనే నువ్వు బతుకుతావు.. అని చెప్తుంది. అరుందతినే చంపిన దాన్ని నాకు ఆ పిండం ఒక లెక్క కాదు.. అంటుంది మనోహరి. అయితే ఈ లోపు ఆ బ్లాక్ మ్యాన్ నిన్ను చంపేస్తాడేమో..? అని చంభా అడగ్గానే.. ఆ బ్లాక్ మ్యాన్‌ను అడ్డం పెట్టుకుని ఆ భాగీని చంపేస్తాను అంటూ డోర్ దగ్గర నిలబడిన మిస్సమ్మను చూసి షాక్ అవుతుంది మనోహరి. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.