మహానాడులో టీడీపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని, నారా లోకేష్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నారంతా. కానీ చంద్రబాబు అంతకు మించి సంచలన కామెంట్లు చేశారు. మూడు రోజుల మహానాడు తొలిరోజే ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే సంబంధించిన అంశం కాదు, పోనీ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పరిమితం అయ్యేది కాదు. మొత్తం దేశానికి సంబంధించినది. అవును, దేశవ్యాప్తంగా అమలయ్యే ఓ సంచలన నిర్ణయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.
Day-1: మహానాడు @కడప #Mahanadu2025Begins https://t.co/9KOfvTj8f2
— Telugu Desam Party (@JaiTDP) May 27, 2025
ఎన్డీఏ ప్రభుత్వం డీమానిటైజేషన్ రద్దు చేసే సమయంలో తాను ప్రధాని మోదీకి ఒక సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ టైమ్ లో డిజిటల్ కరెన్సీపై తాను ఒక రిపోర్ట్ ని ప్రధానికి ఇచ్చానన్నారు. 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి, కొత్తగా 2వేల నోట్లు తీసుకొచ్చిన సమయంలో తాను ఓ కీలక సూచన చేసినట్టు చెప్పారు. 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లతోపాటు కొత్తగా తెచ్చిన 2వేల నోట్లు కూడా రద్దు చేయాలని, అన్ని పెద్ద నోట్లు రద్దు చేసేయాలని తాను ప్రధానికి సూచించానన్నారు. అలా నోట్లు రద్దు చేస్తే డిజిటల్ కరెన్సీతో అవినీతికి చెక్ పెట్టినట్టవుతుందని చెప్పారు చంద్రబాబు.
అవినీతి పూర్తిగా తగ్గించేందుకే ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఒక్క వాట్సప్ మెసేజ్ తో పనిజరుగుతోందని, అధికారులు కూడా పారదర్శకంగా రిపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక విధానంలో కూడా పారదర్శకత అవసరం అన్నారు. మహానాడు వేదికగా మరోసారి కేంద్రప్రభుత్వాన్ని తాను డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని, దాని స్థానంలో డిజిటల్ కరెన్సీ వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. అలా రిగితే పార్టీకి డొనేషన్ కూడా ఫోన్ ద్వారానే ఇవ్వొచ్చని, రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండదని అన్కూనారు. ప్రజా సేవే పరమావధిగా పనిచేయాలని ప్రజలకు సూచిస్తూ, పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలు తనతో ఏకీభవిస్తే చప్పట్లతో తన నిర్ణయాన్ని ఆమోదించి కేంద్రానికి తెలియజేయాలన్నారు. అన్ని పెద్ద పెద్ద నోట్లు రద్దు చేయాలని చప్పట్లు కొట్టి ఈ అంశానికి ఆమోదం తెలపాలని కోరారు. పెద్దనోట్లు రద్దయితేనే దేశంలో అవినీతి తొలగిపోతుందని, దీనికి కేంద్రం త్వరలోనే శ్రీకారం చుట్టాలన్నారు చంద్రబాబు.
అసలే ఒకసారి నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా వ్యవహారం తారుమారైంది. ఆ గందరగోళం నుంచి కోలుకోడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇలాంటి సందర్భంలో మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేయాలని, వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీయే వాడాలంటూ చంద్రబాబు చేస్తున్న డిమాండ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. మహానాడులో తీర్మానం లాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజామోదం కావాలంటూ చంద్రబాబు ప్రకటించడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రసంగంలో ఈ పెద్దనోట్ల రద్దు అంశమే ఇప్పుడు హైలైట్ అయింది. ఇంతకీ చంద్రబాబు సూచనల ప్రకారం మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారా..? మహానాడులో మరోసారి నోట్ల రద్దుకి నాంది పడినట్టేనా..? వేచి చూడాలి.