CM Chandrababu: అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ అంతా రివర్స్ వ్యవహారం నడుపుతోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ప్రతి పక్షంలో ఉన్న పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తాయని, కానీ వైసీపీ ఎన్నికలు వద్దంటూ కోర్టుకు వెళ్లిందన్నారు. ఇదెక్కడి రాజకీయ పార్టీ అని ప్రశ్నించారు. ఓడిపోతామని వారికి ముందుగానే అర్థమైందన్నారు. అక్కడి నుంచి కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్నికలు ఆపాలని 63 కేసులు వేశారని అన్నారు.
మరోవైపు రిజర్వేషన్లు, డీ-లిమిటేషన్, సర్ ఇలా రకరకాలుగా కేసులు వేసిందన్నారు. తొలి నుంచి వాళ్లు హింసకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ఎత్తులను ఎప్పటికప్పుడు ప్రజలు తిప్పికొట్టారని, వారికి హేట్సాఫ్ చెప్పారు. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల విశ్వాసం ఉన్నంత వరకు ఆటలు సాగుతాయని, ఒక్కసారి విశ్వాసం పోతే మనుగడ కూడా ఉందని తేల్చేశారు.
రూ. 500 నోటు రద్దు చేయాలని పిలుపునిస్తే కొంతమంది ఎగతాళి చేశారని వివరించారు. నేను ఈ విషయం ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. చిత్తూరులో ఓ వ్యక్తికి రూ.1,000 ఇచ్చినా తీసుకోకుండా ఆయన బ్యాలెట్‌లో వేసి ఈ డబ్బులకు అమ్ముడుపోనని నిరూపించారని తెలిపారు. ఈ విషయంలో కేవలం ఓ అడుగు ముందు వేశామన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు అద్భుత ఫలితాలు ఇచ్చారన్నారు. శనివారం మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.
ఈవీఎం, బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ఏదైనా విజయం కూటమిదేనని మనసులోని మాట బయటపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ వస్తే, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ పెరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే స్థానిక ఎన్నికల్లో 3.6 శాతం ఓట్లు పెరిగాయని వివరించారు. కూటమి అభ్యర్థుల సీట్ల సర్దుబాటుపై చాలా శ్రద్ధ పెట్టామన్న ముఖ్యమంత్రి, అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామని వివరించారు.
ALSO READ: మామ వెనక్కి తగ్గు.. అలాంటి మాటలొద్దు, బొత్సకు మేనల్లుడు శ్రీను స్ట్రాంగ్ కౌంటర్
ఎన్నికల కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కర్నూలులో ఎంపీటీసీని ఎంపీని చేశారని, ఇది ఏ పార్టీలో జరిగి ఉండదన్నారు. 22 జెడ్పీ చైర్మన్‌ల్లో 12 మంది మహిళలు ఉన్నారని, అందులో 14 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదివినవాళ్లు ఉన్నారని వివరించారు.