AP Politics: ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ ఎమ్మెల్సీ అంటే ఎందుకంత అభిమానం. ఏకంగా ఆ ఎమ్మెల్సీకి తన స్వంత నియోజవర్గ భాద్యతలు కూడా చంద్రబాబు ఎన్నికల ముందే అప్పగించారు. ఆ ఎమ్మెల్సీ కూడా అంతా తానై నడిపించారు. ఆ యువ ఎమ్మెల్సీపై ఉన్న నమ్మకం ఎలాంటిదంటే, సీఎం చంద్రబాబు కుప్పం వస్తున్నారంటే చాలు, ఈ ఎమ్మెల్సీ ఆ ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. తమ అధినేతకు ఒక్క మాట రాకుండా, కుప్పం భాద్యతలను భుజాన వేసుకొని మోస్తున్నారు ఈ ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఎవరో కాదు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్.
అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరుకు చెందిన డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అంటే ఆ జిల్లాలో తెలియని వారుండరు. ఓ విద్యావేత్తగా కందుకూరు ప్రాంతంలో ప్రస్థానం ప్రారంభించిన ఈయన, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తూరు – రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీకి గట్టి పోటీనిచ్చిన శ్రీకాంత్, విజయఢంకా మోగించారు. అప్పటికే తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాంత్.
జాబ్ మేళాలు, మొక్కల పెంపకం, వైద్య శిబిరాలు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీకాంత్, ఏకంగా సీఎం చంద్రబాబును ఆకర్షించారు. ఇక అంతే సాక్షాత్తు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ భాద్యతలను చంద్రబాబు ఈయనకే అప్పగించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్ళిన సమయంలో సైతం కుప్పం భాద్యతలను భుజాన వేసుకొని, అన్నీ తానై ఆయనే నడిపారు.
మంత్రి నారా లోకేష్ సూచనలతో కుప్పంలో ప్రతి నాయకుడిని, కార్యకర్తను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ చొరవ చూపారని కుప్పం టీడీపీ నాయకులే చెబుతుంటారు. ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి, సీఎం చంద్రబాబు గెలుపులో తనదైన పాత్ర పోషించారని పొలిటికల్ టాక్. ఏదిఏమైనా సుధీర్ఘ రాజకీయ చరిత్ర, 4 సార్లు సీఎంగా ఎన్నిక కాబడ్డ చంద్రబాబు మనసును గెలవడం అంత ఈజీ కాదనే చెప్తారు రాజకీయ విశ్లేషకులు.
Also Read: Rain Alert: వచ్చే 12 గంటలు జోరు వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాల్లో తస్మాత్ జాగ్రత్త!
అటువంటిది సాక్షాత్తు చంద్రబాబే, ఆ ఎమ్మెల్సీకి నియోజకవర్గాన్ని అప్పజెప్పడం ఎంతైనా విశేషమే కదా మరి. అంతేకాదు నిన్న సీఎం సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కూడా పూర్తి విజయవంతం కావడంతో, ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారట. మొత్తం మీద తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సీఎంకు వీరవిధేయుడిగా పేరు గాంచడంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు పార్టీలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.