Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం వరుస వివాదాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాట ఆయనను ఏకంగా జైల్లో పెట్టింది. బెయిల్ ద్వారా బయటికి వచ్చినప్పటికీ ఇంకా ఈ వివాదం సద్దుమణగలేదు. మరోవైపు అల్లు – మెగా వివాదం కూడా కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ జాతకం ఎలా ఉండబోతోంది అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా బిగ్ న్యూస్ ఎక్స్ క్లూజివ్ లో భాగంగా ప్రముఖ జ్యోతిష్యుడు కృష్ణమాచార్య రానున్న రోజుల్లో అల్లు అర్జున్ జాతకం ఎలా ఉండబోతుందో వెల్లడించారు. అందులో భాగంగానే ఆయన అల్లు – మెగా వివాదంపై కూడా స్పందించారు.
కృష్ణమాచార్య మాట్లాడుతూ… “సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల్లో మెగా కుటుంబం కూడా ఒకటి. మకుటం లేని మహారాజుగా మెగాస్టార్ (Chiranjeevi ) ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి డైరెక్ట్ గానూ లేదంటే ఇన్ డైరెక్ట్ గానో అల్లు కుటుంబం కూడా కారణమైంది. ఇక ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి పలుగురు దిగ్గజ నటులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు. మేనమామ మెగాస్టార్ చిరంజీవి చరిష్మాతో పాటు, సొంత ప్రతిభతో అల్లు అర్జున్ కూడా ఈ స్థాయిలో నిలిచారు. అయితే ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా కూటమి ఎన్నికల సందర్భంగా ఆయన స్నేహం కోసమో, లేదంటే మరి ఏదైనా ఇతర రీజన్ తోనో అవతలి పార్టీకి సపోర్ట్ చేయడం వంటివి చూశాం మనం. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదురుతుందా? లేదంటే మరేం జరగబోతోంది? అంటే…
అల్లు అర్జున్ (Allu Arjun) జాతకం ప్రకారం చూస్తే… ఆయన రానున్న రోజుల్లో సోలోగా ప్రయాణాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. కాబట్టి అల్లు – మెగా ఫ్యామిలీ లు కలవడం కష్టమే. కొణిదెల వంశానికి, అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్ళున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో ఒక కారణంతో వచ్చే అభిప్రాయ భేదాలు వీళ్ళను దూరం చేస్తాయి. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే ప్రముఖ కుటుంబాల్లో ఈ రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ విధి వైపరీత్యం కారణంగా అల్లు అర్జున్ లేదా వారి కుటుంబ సభ్యులు ఇకమీదట సొంత ప్రయాణాన్ని షురూ చేస్తారు. మెగా సపోర్ట్ లేకుండానే, సొంత అభిమానులతో ప్రత్యేకమైన విధివిధానాలతో బన్నీ పంథా సాగుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పటికే అల్లు – మెగా వివాదం గురించి రోజుకో రూమర్ షికారు చేస్తోంది. అయితే సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే చిరు షూటింగ్ వదిలేసి మరీ ఇంటికొచ్చారు. ఆ తరువాత బన్నీ కూడా ఆయనను స్వయంగా వెళ్ళి కలిశాడు. దీంతో రెండు కుటుంబాలు మళ్లీ కలిసినట్టేనని అనుకున్నారంతా.