Rain Alert: ఏపీలో జోరు వర్షాల జాడ కనిపిస్తోంది. రానున్న 12 గంటల్లో ఏపీలో మరింతగా జోరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతుండగా, రానున్న 24 గంటలు ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలో గల పలు జిల్లాలలో ఉదయం నుండి మోస్తారు వర్షం కురుస్తోంది. అయితే అల్పపీడనం కారణంగా వచ్చే 12 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది.
అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 12 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన జారీ చేసింది. ప్రధానంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండడమే సురక్షితమని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
Also Read: AP Helmet New Rule: బైక్ పై రయ్.. రయ్ అంటూ వెళుతున్నారా.. ఇప్పటి నుండి ఇక అలా కుదరదు!
ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్స్ ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వరద నీరు చేరేలా ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పుడిప్పుడే ఏపీకి వర్షం వదిలేలా లేదని చెప్పవచ్చు. ఓ వైపు చలిగాలులు మరోవైపు వర్షపు జల్లులు కురుస్తుండగా, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.