ఏ పార్టీ అయిన రాజకీయాల్లో రాణించాలంటే అన్ని వర్గాల మద్దతు అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు పాలిటిక్స్‌ను ఎంతలా ప్రభావ చేస్తాయో వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది వైసీపీ అధ్యక్షుడు జగన్ తన వైఖరితో రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకుంటున్నారా? .. వారి అండ లేకపోతే ఇక కోలుకోనని తెలిసి కూడా మొండగా వ్యవహరిస్తున్నారా? .. ప్రస్తుతం ఈ టాపిక్స్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీకి కాపు సామాజికవర్గం నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందిన తర్వాత కాపు సామాజిక వర్గ నేతలు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ముందుగా కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీ కి రాజీనామా చేస్తే ఆ తర్వాత జగన్ కు అత్యంత నమ్మకమైన సన్నిహితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా పార్టీకి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. నిజానికి తాను అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే ఆళ్ల నానిని మంత్రిని చేశారు జగన్.
అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయినప్పుడు నుంచి ఆళ్ల నాని ముభావం గానే ఉంటూ వచ్చారు. పార్టీ అధికారం కోల్పోగానే ఆయన జగన్ కు బై బై చెప్పేసారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ది కూడా అదే దారి. ఏకంగా 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరుపొందిన గ్రంధి శ్రీనివాస్‌కు కనీసం రెండో విడతలోనన్నా మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ ఎప్పటికప్పుడు తనదైన లెక్కలు వేసుకునే జగన్ ఆయనపై దృష్టి పెట్టలేదు. దాంతో తనకు సరైన గుర్తింపు దక్క లేదని ఎప్పటినుంచో భావిస్తున్న గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీని వదిలేసారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు వైపు వెళ్ళిపోతారన్న విమర్శలు ఎదుర్కొనే అవంతి శ్రీనివాస్ కూడా వైసిపి నుండి బయటికి వచ్చేసారు. జగన్ హయంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాపు నేతలు కూడా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీలో చెప్పుకోదగ్గ కాపు సామాజికవర్గ నేతలను వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చన్న అభిప్రాయం ఉంది. వారు కూడా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం దొరక్కే వైసీపీలో కొనసాగుతున్నారంటున్నారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన కాపులను, కాపులు జనసేనను ఓన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ని ఒక సీరియస్ పొలిటిషన్‌గా వారు గుర్తించడానికి కొంత టైం పట్టింది. ఎప్పటికైనా ఏపీలో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ని వారు చూస్తున్నారు. పార్టీ పెట్టిన పదేళ్లకు జనసేనాని గత ఎన్నికల్లో తన స్టామినా ఏంటో చూపించారు. 2024 ఎన్నికల్లో జనసేన హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీల్లో ఉండటం కన్నా జనసేనకు షిఫ్ట్ కావడమే మంచిదనే ఆలోచనలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారంట. వీలైతే జనసేనలోకో లేకుంటే కనీసం కూటమిలోని ఇతర పార్టీల్లోనో చేరడం బెటర్ అనే ఆలోచనలో వైసీపీ కాపు నేతలు ఉన్నారంట.
Also Read: కేటీఆర్ ఫార్ములా, బిగిస్తున్న ఉచ్చు.. వివరాలు ఇవ్వాలంటూ ఈడీ లేఖ
విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం దాని అనుబంధ కులాల లీడర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల పరంగా కూడా వారి ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుంది. అయితే వైసీపీలో తమపై ఆ ప్రాంతాలకు సంబంధం లేని కొంతమంది రెడ్డి లీడర్లు సలహాదారుల పేరుతో పెత్తనం సాగించడం జగన్ కు తమకు మధ్య అడ్డుకట్టలా మారిపోవడంతో వారు అసహనానికి లోనవుతున్నారంట. దానికి తోడు జగన్ కూడా క్షేత్ర స్థాయి పరిస్థితులను లెక్క లోకి తీసుకోకుండా తనకు తోచినట్టు చేసుకుపోతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను జగన్ పురమాయిస్తూ పవన్ కళ్యాణ్‌ను తిట్టిస్తూ రావడంతో ఆ వర్గం వైసీపీకి పూర్తిగా దూరమైందన్న వాదన ఉంది. ఆ క్రమంలో తమ సొంత ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతింటుందని, తమకు ఉనికే లేకుండా పోతుందని భయపడుతున్న కాపు లీడర్లు వైసీపీకి బై బై చెప్తున్నారంట. మరి రానున్న రోజుల్లో ఇంకెంత మంది కాపు లీడర్లు బయటకు వస్తారో? జగన్ వారికి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.