Chandrababu: నెల రోజుల్లోనే పోలీసులను గాడిన పెడదామని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీ అనంతరం రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియాలో చేస్తోన్న అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలని..ఉపేక్షించవద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దీంతో చాలాసేపు సోషల్ మీడియాపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. పోస్టులపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ కొంతమంది పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
మరోవైపు కొందరు అధికారుల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని సీఎంకు మంత్రులు చెప్పారు. తాము ఫోన్ లు చేసినప్పటికీ కొందరు ఎస్పీలు ఫోన్ తీయడం లేదని ఫిర్యాదు చేశారు. కింది స్థాయిలో డీఎస్పీ, సీఐల నెపం నెట్టి తప్పించుకున్నారని చంద్రబాబుకు తెలిపారు. దీంతో మంత్రులు మాట్లాడుతుండగానే కలగజేసుకుని మాట్లాడిన పవన్..అందుకే తాను తీవ్ర స్థాయిలో స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. మంత్రులతో చర్చించిన అనంతరం చంద్రబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం నుండే పోలీసులు ఇలా తయారయ్యారని మండిపడ్డారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే పోలీసు వ్యవస్థను సైతం గాడిన పెడదామని మంత్రులకు సూచించారు. సోషల్ మీడియాలో ఇకపై అసభ్య పోస్టులు పెడితే ఉపేక్షించేదని లేదని అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తానే హోంశాఖను తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అదే అంశంపై పవన్ సీఎంకు క్లారిటీ ఇచ్చారు.