CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలకు చెక్ పడనుందా? సినీ ప్రముఖులు రేపో మాపో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారా? కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యిందా? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుందా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పుల్‌స్టాప్ పడనుంది. ఈ వివాదాలకు త్వరలో ముగింపు పడనున్నాయి. సీఎం చంద్రబాబుతో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సమావేశానికి ముహూర్తం దాదాపుగా ఖరారు అయ్యింది. అయితే ఈ వారం, లేకుంటే వచ్చేవారు సమావేశం జరగనుంది. అనేక సమస్యలకు ఈ సమావేశంలో ఒక ముగింపు వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దలతో సమావేశం కాలేదు. పరిశ్రమ పెద్దలు-ప్రభుత్వ అధికారుల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. తమ సినిమాలుంటే నిర్మాతలు సంబంధిత శాఖ మంత్రిని కలిసి చెబుతున్నారు. అంతేగానీ నేరుగా వచ్చిన ప్రభుత్వ పెద్దలతో పరిశ్రమకు చెందిన వ్యక్తులు మాట్లాడిన సందర్భాలు లేవు.
పరిశ్రమ వ్యవహారశైలిపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి చాన్నాళ్లు అవుతున్నా ముఖ్యమంత్రితో సమావేశం జరగకపోవడంపై గట్టిగానే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు రెడీ అయినట్టు తెలుస్తోంది.
ALSO READ: లోకేష్ మాటేంటి? అధినేత చంద్రబాబు ఏమన్నారు?
ఇదే విషయాన్ని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధిపై నోరు విప్పారు ముఖ్యమంత్రి. ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులందరికీ బాధ్యత ఉంటుందని చెప్పారు. వాళ్లు కూడా కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు రాష్ట్రాల్లో వారికి మార్కెట్ ఉందని, అదే సమయంలో ప్రాంతాలు అభివృద్ధి జరగాలన్నారు.
అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినట్టు వారు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు సీఎం. ఈ నెల చిత్ర ప్రముఖులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సమావేశంలో అందరి సహకారం కోరుతామని, వాళ్లకు ఏమేమి చెయ్యాలో వాటి కోసం ఎకో సిస్టం క్రియేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
మరోవైపు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యేందుకు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు అప్పాయింట్మెంట్ కోరారు. ఉండవల్లిలో ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీకి దాదాపు 30 మంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఏపీలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించనున్నారు. సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల వ్యవహారం, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వాటిపై చర్చకు వచ్చే అవకాశం ఉంది.