ఏపీ సీఎం చంద్రబాబు, ఇటీవల జనంతో బాగా కలసిపోతున్నారు. రాజకీయ జీవితంలో నాలుగున్నర దశాబ్దాలపాటు ఆయన పేదలకు దగ్గరగా ఉన్నా కాస్త రిజర్వ్ డ్ గానే ఉండేవారు. కానీ 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక జనంలో కలసిపోయి, వారితోపాటు తాను కూడా ఆయా పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో పేదల ఇళ్లకు పెన్షన్లు పంచడానికి వెళ్లిన ఆయన వారింట్లో తాను టీ పెట్టి వారికే ఇచ్చారు. తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలుసుకోడానికి వెళ్లి, అక్కడ కంకర రాళ్లను పారతో ఎత్తి తట్టలో వేశారు. వారి పనుల్లో పాలుపంచుకున్నారు. అటు పాలనలోనూ, ఇటు ప్రజల సందర్శన లోనూ చంద్రబాబు 2.ఓను ప్రజలు చూస్తున్నారు.
పేదల సేవలో కార్యక్రమం సందర్భంగా ఆత్మకూరు వచ్చిన సీఎం చంద్రబాబు గారు.. భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. వస్తున్న వేతనం, సమస్యలు తెలుసుకున్నారు. #InternationalLabourDay #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/9BPcnyBCcN
— Telugu Desam Party (@JaiTDP) May 1, 2025
పేదల సేవలో కార్యక్రమం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు వచ్చారు సీఎం చంద్రబాబు. కార్మికుల దినోత్సవం కూడా కావడంతో ఆయన స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులను కలిశారు. వారితో మాట్లాడారు. వారికి అందుతున్న వేతనం, పని ప్రాంతంలో వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకోసం ప్రభుత్వ పరంగా ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలను వారికి వివరించారు. మరింత అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన గులకరాళ్లను పారతో ఎత్తారు. సుత్తిని పైకెత్తారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ మధ్యకు రావడమే ఆశ్చర్యం అయితే, తమ పనిముట్లను ఆయన పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయామని అంటున్నారు భవన నిర్మాణ కార్మికులు.
చంద్రబాబుకి పరిపాలనాదక్షుడిగా పేరుంది. వైరి వర్గంలోని నేతలు కూడా చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు. సామాన్య ప్రజల్లో కూడా ఆయనకు ఆ పేరుంది. అయితే అడ్మినిస్ట్రేటర్ గా ఆఫీస్ లో ఉండి నిర్ణయాలు తీసుకోవడంపాటు.. ప్రజలతో మమేకం అవడం, తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచిని వారికి వివరించి చెప్పడం కూడా అవసరమే. ఈసారి చంద్రబాబు రెండో దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయనే స్వయంగా పాల్గొంటున్నారు. ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని ఒకటో తేదీన పెన్షన్ లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడుతున్నారు. వారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోతున్నారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు వెళ్లిన చంద్రబాబు వారి ఇళ్లలోనే టీ పెట్టి వారికే అందించారు. వారిలో ఒకరిగా కలసిపోయారు. చంద్రబాబు చేత్తో టీ అందుకున్నామని, తమ జీవితంలో ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేమని లబ్ధిదారులు సంతోషంతో ఉప్పొంగిపోయేవారు. కేవలం ప్రజలకు అవసరమైన పథకాలు అమలు చేయడమే కాదు, క్షేత్ర స్థాయిలో వారి కష్టాలను తెలుసుకోడానికి వారితో మమేకం అవుతున్నారు చంద్రబాబు. ఈ మార్పు ప్రజలకు బాగా నచ్చింది. గతంలో ఆయన పాలనను మెచ్చుకునేవారు, ఇప్పుడు ఆయన సాహచర్యాన్ని అనుభూతి చెందుతున్నారు. నాయకుడంటే ఎన్నికలప్పుడే కాదు, మిగతా సమయాల్లో కూడా ప్రజలకు దగ్గరగానే ఉండాలని నిరూపిస్తున్నారు చంద్రబాబు.