సింహాచలం పుణ్యక్షేత్రంలో చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనకు మూల కారణం ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతోంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని ప్రకృతి వైపరీత్యంగా తేల్చేశారు కానీ, అందులో మానవ తప్పిదమే ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది. హడావిడిగా గోడ కట్టడం, అందులోనూ నాణ్యత అస్సలు పాటించకపోవడం, కనీసం పిల్లర్లు, కాంక్రీట్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్ తో గోడ కట్టడం వల్లే ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. దీనిపై ప్రభుత్వం విచరాణ కమిటీ వేయడంతో ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి.
కాంట్రాక్టర్ రిస్క్ అని చెప్పినా.. బలవంతంగా సింహాచలం గోడ కట్టించిన కూటమి ప్రభుత్వం
చందనోత్సవానికి సమయం చాలా తక్కువ ఉందని.. నాణ్యమైన గోడ కట్టలేనని మొత్తుకున్న కాంట్రాక్టర్ లక్ష్మణరావు
కానీ.. టెంపరరీ గోడ కడితే చాలని కాంట్రాక్టర్ను మభ్యపెట్టిన… pic.twitter.com/PKJrRbR6Rc
— YSR Congress Party (@YSRCParty) May 1, 2025
కాంట్రాక్టర్ ఏమన్నారు..?
విచారణ కమిటీ అధికారుల ముందు ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికారులే బలవంతంగా తమతో గోడ కట్టించారని కమిటీ ముందు స్పష్టం చేశారు కాంట్రాక్టర్ లక్ష్మణరావు. అక్కడ గోడ కట్టలేమని తాను ముందుగానే చెప్పానని, కానీ అధికారులు బలవంతం చేశారని, తాను వద్దన్నా పని చేయాలని ఆదేశించారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో గోడ కట్టామని అన్నారు.
ఏది నిజం..?
సింహాచలం చందనోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే విషయం తెలిసిందే. అయితే అక్కడ అంతకు ముందు నుంచే ప్రసాద్ పథకం ద్వారా పనులు జరుగుతున్నాయి. వాటి కొనసాగింపుగానే అక్కడ గోడ కట్టారు. అయితే ఆలయ వైదిక సిబ్బంది అక్కడ గోడ కట్టడం సరికాదని చెప్పారు. కానీ అధికారులు మాత్రం గోడ కట్టేందుకే నిర్ణయించారు. చందనోత్సవానికి కూడా టైమ్ దగ్గరపడటంతో హడావిడిగా గోడ కట్టినట్టు తెలుస్తోంది. చందనోత్సవం సమయానికి గోడ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడంతో అది నాసిరకంగా మారింది. అయితే ఇక్కడ తప్పు పూర్తిగా కాంట్రాక్టర్ దా, లేక అధికారులదా అనేది తేలాల్సి ఉంది.
కొండపైన ఉండే సింహాచలం లాంటి క్షేత్రాల్లో నిర్మాణాలు మరింత పటిష్టంగా ఉండాలి. ఒకవేళ వర్షం పడితే అక్కడ కొండవాలుగా వచ్చే వరదనీరు పటిష్ట నిర్మాణాలను సైతం పక్కకు నెట్టేస్తుంది. అందుకే కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే అక్కడ చేపట్టాలి. కానీ కూలిన గోడ విషయంలో అలాంటి ప్రమాణాలు పాటించలేదు. కేవలం రాయిపై రాయి పెట్టి కట్టుకుంటూ వెళ్లారు. మధ్యలో పిల్లర్లు వాడలేదు, ఎక్కడా కాంక్రీట్ కూడా ఉపయోగించలేదు. దీంతో ఒక్కసారిగా వర్షం కురవడం, వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గోడకూలిపోయింది. భక్తులు దుర్మరణం పాలయ్యారు.
ప్రభుత్వం బాధ్యత ఎంత..?
సింహాచలం ఘటనలో తప్పంతా ప్రభుత్వానిదేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అసమర్థత దీనికి ప్రధాన కారణాలని తేలింది. అదే సమయంలో.. చందనోత్సవం వంటి పెద్ద కార్యక్రమాలు జరిగే సందర్భంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులోనూ ఇటీవలే తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట జరిగిన ఉదాహరణ కూడా ఉంది. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఈ తరుణంలో మరో ప్రమాదం జరగడం బాధాకరం. ఇకనైనా ఇలాంటి దుర్ఘటనలకు అడ్డుకట్టపడాలి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.