AP New Districts: వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అస్తవ్యస్తంగా జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిందని తెలిపారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లాల పునర్విభజనపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై వివిధ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను సీఎంకు వివరించారు.
అశాస్త్రీయంగా జిల్లాల విభజన వల్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలో సమస్యలపై ఈ సమీక్షలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజలు అవసరాలు, సౌకర్యాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా చర్చించారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది.
జిల్లాల పునర్ విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఈ ఏడాది జులైలో ఏడుగురు మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, ఎన్నికల సమయంలో హామీలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా ఈ సమీక్షలు చర్చించారు. అన్ని వర్గాల ప్రజల భౌగోళిక, సాంస్కృతిక, భాషా తదితర భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైన, సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఏపీలో జిల్లాల పునర్ విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ నెలాఖరులోపు జిల్లాల పునర్ విభజన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జనవరి ఒకటి నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో మంత్రివర్గ ఉప సంఘం విభజన ప్రక్రియను ముమ్మరం చేసింది. అన్ని జిల్లాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రజల సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. నవంబర్ 7న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, కొన్ని ప్రాంతాలు పాత జిల్లాల్లో కలపాలనే ప్రతిపాదనలు పెద్ద ఎత్తున వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాను రెండుగా విభజించి పలాస కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తుంది. ఏలూరు జిల్లాను రెండుగా చేసి జంగారెడ్డిగూడెం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి వినతలు అందుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా విభజనపై విమర్శలు వచ్చాయి. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో, కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలపడంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉన్నారు. దీంతో వీటిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతలు వస్తున్నాయి.
మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీశైలాన్ని కూడా మార్కాపురం జిల్లాలో చేర్చాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం, సుండిపెంటను జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉన్నాయి. దీంతో మార్కాపురం జిల్లాలో శ్రీశైలం కలపాలనే డిమాండ్ వస్తుంది. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ సబ్ కమిటీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.