తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మరణంపై సంతాపం తెలియజేస్తూ ఏపీ మాజీ సీఎం జగన్ ట్వీట్ వేశారు. పొరుగు రాష్ట్రం, అందులోనూ బీఆర్ఎస్ నేతలతో జగన్ కి ఉన్న అనుబంధం దృష్ట్యా ఆ ట్వీట్ వేశారనుకుందాం. రెండు మూడు రోజులుగా ఏపీలో ఒకటే తుఫాన్ అలజడి. తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి, వైసీపీ నాయకులు జనంలోకి వెళ్లండి అనే ట్వీట్ కూడా జగన్ వేస్తే బాగుండేదేమో. మరోవైపు సీఎం చంద్రబాబు అధికారులతోపాటు నాయకుల్ని కూడా రంగంలోకి దింపారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు జనంలోకి వెళ్లి సాయం చేయడానికి మేమున్నామంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. తుఫాన్ విషయంలో సైలెంట్ గా ఉన్న జగన్, తీరా నష్టం జరిగాక విమర్శిస్తూ ట్వీట్లు వేస్తే అప్పుడు జనాలకు మరింత అలుసవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సత్యనారాయణ రావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2025
జగన్ ఏం చేస్తున్నారు?
మొంథా తుఫాన్ ఏపీని వణికిస్తోంది. రాయలసీమ జిల్లాలు మినహా మిగతా ఏపీఅంతా అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సహా కోస్తా జిల్లాలన్నిట్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తీరం తాకక ముందే తుఫాన్ అలజడితో జనం వణికిపోతున్నారు. పెన్నా సహా ఇతర వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో అనంతపురం, కడప, నెల్లూరు జిల్లా ప్రజలు ముంపుబారిన పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా జగన్ ఎక్కడున్నారో తెలుసా? ఎస్, మీరు ఊహించింది కరెక్టే, ఆయన బెంగళూరులోనే మకాం వేశారు. హరీష్ రావు కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ వేశారు.
టీడీపీ ఏం చేస్తోంది?
ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ అధికారికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు చేపడుతూనే తమ పార్టీ నేతల్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. గత వైసీపీ హయాంలో ఈ స్థాయిలో పార్టీ జనంలోకి వెళ్లలేదని అంటున్నారు. ఇప్పుడు అధికారులు ఓవైపు, టీడీపీ నేతలు మరోవైపు రంగంలోకి దిగారు. అధికారులు పెట్టే కాల్ సెంటర్లతోపాటు.. టీడీపీ నేతలు తమ తమ ప్రాంతాల్లో సెల్ ఫోన్ నెంబర్లను ప్రజలకు ఇస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని చెబుతున్నారు. మంత్రులు కూడా ఓవైపు సమీక్షలు చేపడుతూనే, మరోవైపు తమ తమ నియోజకవర్గాల్లో స్థానిక నేతల్ని రంగంలోకి దింపి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
జగన్ చేయాల్సిందేంటి?
ఇక్కడ తేడా స్పష్టంగా జనాలకు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో ఉండేవారని వైసీపీ నేతలు విమర్శించేవారు. మరిప్పుడు మొంథా వంటి తీవ్ర విపత్తు వేళ జగన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. జగన్ నేరుగా జనంలోకి రావాలని, ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని, పునరావాస కేంద్రాల వద్ద జనం బాగోగులు తెలుసుకోవాలని ఎరూ అనుకోరు. కనీసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తే ఎంతబాగుంటుంది. పార్టీ తరపున ప్రజల వద్దకు వెళ్తున్న నేతలకు మోరల్ సపోర్ట్ ఇస్తే ఇంకెంత బాగుంటుంది. వైసీపీ తరపున కొంతమంది నేతలు జనంలోకి వెళ్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నవారు, పార్టీ తరపున తమ వాయిస్ ని బలంగా వినిపించిన వారు మాత్రం ఇప్పుడు సైలెంట్ గా ఉండటం గమనార్హం.
Also Read: అస్తవ్యస్తంగా జిల్లాల విభజన.. పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు