Severe Cyclone Montha: ఆంధ్రప్రదేశ్ పై మొంథా తుపాను విరుచుకుపడుతోంది. గంటకు 12 కి.మీ వేగంతో కాకినాడ తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160 కి.మీ, కాకినాడకి 240 కి.మీ, విశాఖపట్నానికి 320 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి కాకినాడ-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో రైల్వే శాఖ 100కి పైగా రైళ్లను రద్దు చేసింది. అలాగే విజయవాడ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావం దృష్ట్యా నైట్ హాల్టులు వద్దని అధికారులకు సూచించారు. రద్దీ ఉండే రూట్లలోనే బస్సులను నడపాలని, అవసరం లేని మార్గాల్లో తాత్కాలికంగా బస్సుల రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే కాల్వలు, కాజ్ వే లు, కట్టల మీదుగా ప్రయాణించాల్సిన బస్సులను ఆ రూట్లలో తాత్కాలికంగా నడపొద్దని సూచించారు. విశాఖ, కాకినాడలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు.
విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి మార్గంలో ప్రయాణించే 22 ఆర్టీసీ బస్సులను అధికారులు రద్దు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంతో రవాణా శాఖ తనిఖీలు ముమ్మరం చేయడంతో ప్రైవేట్ బస్సులు చాలా వరకు రోడ్డెక్కపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం వేచిచూస్తున్నారు. తుపాను పరిస్థితిని బట్టి మరిన్ని బస్సు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
బ్రిడ్జిలు, రోడ్లపై ప్రవాహాలు ఉండే ప్రాంతాలకు బస్సులు నిలిపివేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారుల వినతి మేరకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్లలో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.
మొంథా తుపాను దృష్ట్యా రైల్వే శాఖ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి విశాఖ, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం మీదుగా వెళ్లే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. రైళ్లు రద్దు కావడంతో విజయవాడ రైల్వే స్టేషన్ ఖాళీగా కనిపిస్తుంది.
Also Read: AP Schools Holiday: మొంథా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు.. ఎయిర్ సర్వీసులు రద్దు
ఇప్పటికే రైల్వే శాఖ 100కు పైగా రైళ్లను రద్దు చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోనే 95 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి మార్గాల్లో ప్రయాణించే సర్వీసులతో పాటు భువనేశ్వర్, చెన్నై, హౌరా, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తున్నారు.