Montha Cyclone Alert: మొంథా తీవ్ర తుపానుగా మారింది. గంటకు 10 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్టుల్లో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ పోర్టుకు పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 9వ నెంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో తుపాను కదిలింది. తుపాను ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కి.మీ, కాకినాడకి 190 కి.మీ, విశాఖపట్నానికి 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
విశాఖలో మొంథా తుపాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు కైలాసగిరి సమీపంలో భారీ చెట్టు రోడ్డుపై కూలిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకూలుతున్నాయి. తుపాను ప్రభావంతో అంబాజీపేట మండలం వక్కలంక గ్రామంలో చెట్లు నేలకూలాయి.
ఉప్పాడ తీరంలో మొంథా తుఫాన్ ప్రభావంతో రాకాసి అలలు తీరాన్ని తాకుతున్నాయి. రక్కసి అలల కారణంగా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రోడ్డు మార్గం ధ్వంసం అయింది.
ఉప్పాడ తీరంపై మొంథా తుఫాన్ ప్రభావం
ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రోడ్డు మార్గం ధ్వంసం pic.twitter.com/aJacKXN9bv
— ChotaNews App (@ChotaNewsApp) October 28, 2025
విశాఖ జిల్లా గాజువాక-యారాడ సమీపంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు భారీగా విరిగి పడుతుండడంతో యారాడ నుంచి గంగవరం వస్తున్న బస్సులను కాసేపు నిలిపివేశారు.
తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల చేయాలని నిర్ణయించారు. ముందే సురక్షిత లేబేలో వాహనాలను నిలుపుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.