CM Chandrababu key points: సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయని, వ్యక్తిత్వ హసనం జరుగుతోందన్నారు. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు.
తన జైలు జీవితం, ఆ తర్వాత రాజకీయ ప్రయాణం విషయాలను ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ముందస్తు నోటీసు లేకుండా తనను అరెస్టు చేశారన్న ఆయన, అనుభవం, తన శక్తి సామర్థ్యాలన్నీ తన దృఢ నిశ్చయాన్ని బలపరిచిందన్నారు. గతంలో తన పేరుపై ఉన్న నమ్మకంతో ఒంటరిగా వెళ్లి ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, ఇప్పుడు కలిసి వెళ్లడంతో విజయం సాధించామన్నారు. ఇప్పుడు ప్రజలకు మేలు చేయడమే తన ప్రధాన ధ్యేయమన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తున్నామని, దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది మా లక్ష్యంగా చెప్పారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా పనులు సులువుగా చేసుకో వచ్చన్నారు.
ముఖ్యంగా ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధిగా వర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చన్నారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరిగిన లీడర్‌షిప్ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారు.
ఏపీ గురించి కాకుండా సౌతిండియా, దేశం గురించి.. రాబోయే రాజకీయాల గురించి కీలక విషయాలు బయటపెట్టారు. నరేంద్రమోడీ నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి సీఎంల సమావేశం జరిగింది. అందులోకి కీలక పాయింట్లను బయటపెట్టారు.
నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో 2029 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవ్వాలన్న విషయంపై అందరి అభిప్రాయాలు ప్రధాని మోదీ తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని చెప్పకనే చెప్పారు.
వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమైందన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను కలిపారని గుర్తు చేశారు. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని తాము ముందుగానే ఊహించామన్నారు. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని, కూటమి ధీర్ఘకాలం కొనసాగుతుందని తెలియజేశారు.
పనిలోపనిగా దక్షిణాది జనాభా అంశంపై నోరువిప్పారు సీఎం చంద్రబాబు. చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారని, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైందన్నారు. ఫెర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతోందన్నారు.
ప్రస్తుతం బోర్డర్ లైన్‌లో జననాల రేటు ఉందని, కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మొదలవుతుందన్నారు. దేశంలో 145 కోట్ల జనాభా ఉందని, పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరన్నది చంద్రబాబు మనసులోని మాట.
సరిగా ప్లాన్ చేస్తే 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పనులు చేయడమేకాదు.. దేశానికి ఆదాయం తీసుకొస్తారన్నారు. ఒకప్పుడు బ్రిటీషర్లు ఎలాగైతే భారత్ వచ్చి పరిపాలించారో, మనం కూడా అలాగే ప్రపంచ దేశాలకు వెళ్లి ఆయా దేశాలను పాలించే రోజులు వస్తాయని సూచనప్రాయంగా చెప్పారు.