CM Chandrababu : సోషల్ మీడియాలో విలువలకు స్థానం లేకుండా.. విమర్శల పేరుతో విచ్చలవిడిగా పోస్టులు పెడితే ఊరుకునేది లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హెచ్చరించారు. శ్రీశైలం నుంచి విజయవాడకు సీ – ప్లేన్ సేవల్ని ప్రారభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. అసభ్యకర పోస్టులపై తమ వైఖరిని వెల్లడించారు . ఇకపై మీరు 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటూ వ్యాఖ్యానించారు.
రాజకీయాలు హుందాగా ఉండలన్న చంద్రబాబు.. ఎవరైనా గౌరవం కోసమే రాజకీయాల్లోకి వస్తారన్నారు. అలాంటిది.. ఇలాంటి అసభ్యకర ధోరణిలో పోస్టులను చూడాల్సి రావడం దురదృష్టమన్నారు. తాను గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానన్న బాబు.. ఇప్పుడున్న పరిస్థితులు గతంలో ఎప్పుడూ తాను చూడలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో ఏపీలో కనిపించనివ్వను అని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆరోపించిన ముఖ్యమంత్రి.. రివ్యూల్లో అసలు వ్యవహారాలు బయటపడుతున్నాయంటూ ఆగ్రహించారు. ఇటీవల జరిగిన క్యాబినేట్ భేటిలోని కొన్ని
ఘటనల్ని ఉదహరించిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చర్చ జరిగినట్లు తెలిపారు. వైసీపీ అనుకూల వ్యక్తులు చేస్తున్న తప్పుడు పోస్టుల కారణంగా.. డిప్యూటీ సీఎం, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ కుతుళ్లు బోరున విలపించారని తెలిపారు. వాళ్లు ఏం తప్పుచేశారని, వాళ్లకు రాజకీయాలతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఓ డిప్యూటీ సీఎం పరిస్థితే ఇలా ఉంటే ఎలా అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్ని అంతం చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో ఏ ఆడబిడ్డల జోలికి వచ్చినా చూస్తూ ఊరుకోమని, గంటలు, రోజుల వ్యవధిలోనే వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఫేక్ పోస్టులు పెట్టేవారిని విడిచిపెట్టమన్న చంద్రబాబు.. తమాషాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇకపై వైసీపీ కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టినా వదిలిపెట్టను అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిళ సహా, వివేకానంద కుమార్తె.. వైఎస్ సునీతా రెడ్డి పైనా.. గతంలో, ఇప్పుడు అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. వాటిలో చాలా అసభ్యకర, బూతు పదాలతో పోస్టులు ఎక్కువగా ఉంటుంటాయి. వాటిపై ఇప్పటికే.. వైఎస్ షర్మిళ, సునీతా అనేక సార్లు పోలీసుల్ని సైతం ఆశ్రయించారు. దాంతో.. వారూ ఈ రాష్ట్రం ఆడబిడ్డలేనని.. వారిపైనా ఎలాంటి అసభ్యకర పోస్టులు పెట్టేందుకు సాహసించవద్దని హెచ్చరించారు.
ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సీఎం చంద్రబాబు, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ఈ ధోరణి కొనసాగుతుందని గుర్తు చేశారు. వివేక చనిపోయినప్పుడు గుండెపోటు అని మొదట నమ్మించారని, తర్వాత అది గొడ్డలి వేటు అని తెలిసాక.. నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసారని గుర్తుచేసుకున్నారు. అప్పుడు.. వారిపై చర్యలు తీసుకోకపోవడమే తాను చేసిన తప్పు అన్న ఆయన.. ఇప్పుడు అలా కాదని, తాను పూర్తిగా మారిపోయానని హెచ్చరించారు.
Also Read : ఏపీకి నంబర్ వన్ బ్రాండ్ తీసుకొస్తాం: చంద్రబాబు
రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతో కృషి చేస్తున్నామన్న చంద్రబాబు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా ఉంటేనే పర్యాటకులు వస్తారని చెప్పారు. అందుకే.. రాష్ట్రంలోని ఆంబోతుల కట్టడి చేస్తాం, వారి కొమ్ములు విరుస్తామంటూ వ్యాఖ్యానించారు. తనని తక్కువ అంచనా వేస్తున్నారని అన్న చంద్రబాబు.. తాను 1995 లో సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు.. వీళ్లంతా గోలీలు ఆడుకునే బచ్చాగాళ్లు అంటూ విమర్శించారు.