Nayanthara Beyond The Fairy Tale Trailer: మామూలుగా ఒక హీరోయిన్‌కు కెరీర్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుందని, అందుకే క్రేజ్ ఉన్నప్పుడు వీలైనంతగా ఎక్కువ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంటారని చాలామంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు హీరోయిన్లు అలా కాదు.. తాము ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అయినా కూడా వారి గ్రేస్, క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. తాజాగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఒక డాక్యుమెంటరీ తెరకెక్కింది. అదే ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లేడీ సూపర్ స్టార్
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ (Nayanthara Beyond The Fairy Tale) ట్రైలర్ మొదలవ్వగానే తన సినిమాల్లోని కొన్ని సీన్స్‌ను చూపించారు. ఆ తర్వాత తాప్సీ.. నయనతార గురించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘తను హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అంటూ బుక్‌లో ఉండే ప్రతీ రూల్‌ను బ్రేక్ చేసింది’’ అని చెప్పుకొచ్చింది. ‘‘తను థగ్ లాగా అడుగుపెట్టింది. థగ్ లాగే ఉండిపోయింది. అదే తనలో నాకు చాలా ఇష్టమైన విషయం’’ అని నవ్వుతూ చెప్పాడు రానా. ‘‘తనను తాను ఏ స్థానంలో పెట్టుకుంది అనే విషయం నాకు చాలా నచ్చింది’’ అంటూ నయనతారను ప్రశంసించారు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్.
Also Read: నయనతారతో పోటీపడుతున్న సామ్.. నిలదొక్కుకుంటుందా..?
కష్టంగా అనిపించేది
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’లో నాగార్జున కూడా ఉన్నారని ట్రైలర్‌లోనే క్లారిటీ వచ్చేసింది. ‘‘అప్పట్లో తను రిలేషన్‌షిప్స్ విషయంలో చాలా కష్టాలను ఎదుర్కుంది’’ అంటూ నయనతార పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు నాగ్. నయనతార (Nayanthara) కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘నేను సులువుగా మనుషులను నమ్మేశాను. ప్రతీ పేపర్‌లో నా గురించి ఏదో న్యూస్ ఉండేది. అది అసలు ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలిసేది కాదు. మా అమ్మకు కూడా అవన్నీ చూడడం చాలా కష్టంగా అనిపించేది’’ అంటూ ఎమోషనల్ అయ్యింది. ‘‘దేవుడి తర్వాత నా కూతురి గురించే నాకే తెలుసు’’ అంటూ నయన్ తల్లి కూడా తన గురించి గర్వంగా చెప్పింది.
ప్రేమలో ఉన్నట్టు తెలియదు
ఇక ఈ ట్రైలర్‌లో నయన్, విక్కీల ప్రేమకథ గురించి కూడా చూపించారు. ‘‘నా మనసు వెతుకుతూ ఉన్న మనిషి తను. ప్రపంచంలో అందరికంటే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు’’ అంటూ తన భర్త విఘ్నేష్ శివన్ గురించి చెప్పుకొచ్చింది నయనతార. ‘‘లాస్ట్ షెడ్యూల్ వరకు మేము ప్రేమలో ఉన్నామని సెట్‌లో ఎవ్వరికీ తెలియదు. నేను నా జీవితంలోనే అలాంటి పెళ్లి చూడడానికి కూడా వెళ్లలేదు. అలాంటిది నా పెళ్లే అలా జరిగింది’’ అని గుర్తుచేసుకున్నాడు విఘ్నేష్. ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టని నయన్.. తమ సంతోషాన్ని చూసి నలుగురు సంతోషిస్తారనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.