CM Chandrababu Visited Budameru: ఏపీ మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు మరోమారు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమయ్యిందన్నారు. మంగళవారం ఆయన బుడమేరుకు చేరుకుని గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామా నాయుడు ఆయనకు గండ్ల పూడ్చివేతకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. గండ్ల పూడ్చివేత పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు.. మంత్రి నిమ్మల, అధికారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ అధ్యక్షుడు జగన్ పాలనలో ఏపీలోని వ్యవస్థలన్నీ కూడా చిన్నభిన్నమయ్యాయి. బుడమేరును అంతా కబ్జా చేశారు. బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు మంత్రి నిమ్మల, అధికారులు ఎంతో కష్టపడ్డారు. అప్పజెప్పిన పనులను వారు విజయవంతంగా పూర్తి చేశారు. వరదల నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగమంతా ఎంతో కష్టపడింది. పదిరోజులపాటు వరదలపై యుద్ధం చేశాం. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
Also Read: కలెక్షన్ కింగ్.. ఫీజులేమైనా కలెక్షన్లా? మోహన్ బాబు బాగోతం బట్టబయలు!
వరద ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడి పనిచేశారు. వెనువెంటనే స్పందించి ప్రాణ నష్టం తగ్గించగలిగాం. పైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేస్తున్నాం. ఏపీలో వచ్చిన వరదలపై యుద్ధం చేశాం.. చివరకు గెలిచాం. కానీ, యుద్ధంలో గెలిచినా దాని ప్రభావం ఇంకా వెంటాడుతూనే ఉన్నది.
బడమేరు గట్ల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కృష్ణానదిలో 11.43 క్యూసెక్కుల వరద వచ్చింది. దీనికితోడుగా డ్రెయిన్లు పొంగాయి. ఇవన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయి. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు కష్టపడి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చివేశారు. డ్రోన్ లైవ్ ద్వారా ఈ గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షించా. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బుడమేరు కబ్జాలకు గురైంది. బుడమేరు వరదల వల్ల దాదాపు 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. దుర్మార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. వరద బాధితులకు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో ఆహారం, తాగునీటిని అందించాం. అయితే, ఎంత ప్రయత్నించినా కూడా శివారు ప్రాంతాలకు సరిగా సాయం అందించలేకపోయాం. మూడురోజులపాటు ఏం చేయాలో.. ఎలా చేయాలో అర్థం కాలేదు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ చిన్నాభినమయ్యాయి.
Also Read: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడి
వరద బాధితులకు చాలామంది ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. కొందరు ఆహారం సాయం చేస్తున్నారు. ఇంకొందరు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇటువంటి ఆపత్కార సమయంలో వైసీపీ విషయం చిమ్ముతోంది. ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. కృష్ణాలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు నదిలో మూడు బోట్లు వదిలిపెట్టారు. ఆ బోట్లు కౌంటర్ వెయిట్ కు కాకుండా కాలమ్ ను ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత వివరించలేనంతగా ఉండేది. బోట్లకు వైసీపీ రంగులు ఎందుకున్నాయి..? బోట్లు వదిలినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ సీఎం చంద్రబాబు అన్నారు.