Manipur Bans Internet services For 5 Days Over Law And Order Situation: మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఈ హింసాకాండలో దాదాపు 11 మంది మృతి చెందారు. సోమవారం కూడా మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ల జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా యంత్రాగం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు తమ నివాసాలను వదిలి వెళ్లడానికి వీల్లేదని.. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని పశ్చిమ ఇంఫాల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. అయితే అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపునిచ్చింది.
16 నెలలుగా మణిపూర్ లో హింస చేలరేగుతూనే ఉంది. తాజా ఈ అల్లర్లు మరోసారి తీవ్రమైనట్లు కనిపిస్తోంది. 11 మంది చనిపోవడంతో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈరోజు కూడా విద్యార్థులు మణిపూర్ లోని రాజ్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇంకోవైపు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
Also Read: డ్రోన్ల ద్వార బాంబులు.. మణిపూర్‌లో దాడులు చేస్తున్న మిలిటెంట్లు ఎవరు?
ఏడాదిన్నర నుంచి రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలకు 220 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కుకీ తెగ వారే ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్ కు మచ్చతెచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం.. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి… మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.