BigTV English

TDP MLA Kolikapudi Issue: కొలికపూడిపై చంద్రబాబు సీరియస్.. ఏ క్షణమైనా..

TDP MLA Kolikapudi Issue: కొలికపూడిపై చంద్రబాబు సీరియస్.. ఏ క్షణమైనా..

TDP MLA Kolikapudi Issue: తిరువూరు టీడీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాజీనామా చేస్తానని ఎందుకు అంటున్నారు? అనూహ్య పరిస్థితుల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలికపూడి శ్రీనివాస్ ప్రశాంతంగా తన పదవిని ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? పది నెలలు పూర్తి కాక ముందే రాజీనామా బెదిరింపుల వెనుక ఆంతర్యమేంటి? రెండు, మూడు సార్లు పార్టీ నుంచి వార్నింగులు వచ్చినా పట్టించుకోని శ్రీనివాస్.. ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అనటంలో లాజిక్ ఏంటి? కొలికపూడి అంత లావున అల్టిమేటం ఇచ్చినా అధిష్టానం స్పందించకపోవడంపై జరుగుతున్న చర్చేంటి?


తిరువూరు పంచాయతీపై టీడీపీ సీరియస్‌ అయ్యింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ అల్టిమేటంపై ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. నెట్టెం రఘురామ్‌, ఎంపీ కేశినేని చిన్ని, మంతెన సత్యనారాయణరాజులతో కమిటీ ఏర్పాటు చేసింది. గత 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనుంది టీడీపీ.

కేశినేని చిన్ని అనుచరుడు ఆలవాల రమేష్‌రెడ్డి


విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు. ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారింది. ఆ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. తనను కాపాడమని రమేష్‌రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని పీఏ కిషోర్‌కు నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షల నగదు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.

1999 తర్వాత తిరువూరులో విజయం సాధించిన టీడీపీ

48 గంటల్లో రమేష్‌రెడ్డిని సస్పెండ్ చేయకపోతే రాజీనామాకైనా సిద్దమని కొలికపూడి ప్రకటించారు. వాస్తవానికి తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచి చాలా కాలం అయింది. 1999 ఎన్నికల్లో నల్లగట్ల స్వామిదాసు టీడీపీ నుంచి గెలిచారు. మళ్లీ ఇంతకాలానికి ఆ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించగలిగారు. అక్కడ ఉన్న వర్గ పోరాటం ఇతర కారణాలతో టీడీపీ ఎప్పటికప్పుడు ఓడిపోతూ వచ్చింది. అందుకే ఈ సారి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికపూడికి.. పార్టీతో పెద్దగా సంబంధం లేకపోయినా టిక్కెట్ ఇచ్చారు. ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. దాన్ని నిలబెట్టుకుని అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన ఆయన.. అందరికీ దూరమవుదూ తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు.

పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు రెండు సార్లు హాజరైన కొలికపూడి

మొదటి నుంచి తిరువూరు నియోజకవర్గం టీడీపీలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడి అన్నట్లు పరిస్థితి తయారైంది. ఎమ్మెల్యే ఒక సర్పంచ్‌ను వేధించారని చెప్తూ మొదలైన వివాదం. మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో మరింత ముదిరింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరువూరుకు చెందిన ఒక వర్గం టీడీపీ నేతలు విజయవాడలో ధర్నాలు చేసి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అదంతా తనపై జరుగుతున్న కుట్రని కొలికపూడి ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో కొలికపూడి పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు రెండు సార్లు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంతకు ముందెప్పుడూ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన కొలికపూడి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత.. అమరావతి టాపిక్ వస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు. గ్రీన్ కలర్ తలపాగా కట్టుకుని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చెలరేగేవారు. అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్దత చూసి తెలుగుదేశం పార్టీ ఏరికోరి టికెట్ ఇచ్చింది.

కేశినేని చిన్ని రికమండేషన్‌తో టికెట్ దక్కించుకున్న కొలికపూడి

తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమ్‌ని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికపూడ వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబునాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్‌లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు. అమరావతి ఉద్యమనేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే.. గెలిచాక ఆయన తనలోని మరోకోణం చూపిస్తున్నారంట.

వైసీపీకి ఆయుధంగా మారుతున్న కొలికపూడి వ్యవహారం

తాజాగా కొలికపూడి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారుతోంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమిషన్ల పంచాయితీ సాగుతోందని, వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే పరోక్షంగా చిన్నిని కొలికపూడి టార్గెట్ చేస్తూ.. చిన్ని అనుచరుడైన రమేష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హడావుడి చేస్తున్నారని వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది.

టీడీపీలో కొలికపూడి సీన్ కట్ అవ్వబోతోందా?

అదలా ఉంటే టీడీపీ శ్రేణుల్లో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏవో అవసరాల కోసం రమేష్‌రెడ్డిని కొలికపూడి అప్పుగా సాయం చేయమని కోరారంట. అయితే రమేష్‌రెడ్డి రియాక్ట్ అవ్వకపోవడంతో తిరువూరు ఎమ్మెల్యే కోపమొచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టారంట. అయితే కొలికపూడి మీడియా ముందుకొచ్చి అంత హడావుడి చేస్తున్నా.. ఆయన డిమాండ్‌పై టీడీపీ అధిష్టానం స్పందించలేదు. కనీసం పార్టీ పెద్దలు కొలికపూడిని పిలిచి మాట్లాడ లేదు. ఆ క్రమంలో టీడీపీలో కొలికపూడికి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందని… ఇక ఆయనకు పార్టీలో సీన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×