CM Chandrababu Naidu: జమిలి ఎన్నికలకు ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు సీఎం చంద్రబాబు. జమిలిపై అవగాహన లేని వైసీపీ, పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోంద న్నారు. వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని మనసులోని మాట బయటపెట్టారు.
రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్-2047 అని చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు.. 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.
మరోవైపు సభ్యత్వం నమోదులో టీడీపీ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. సభ్యత్వ నమోదుపై టీడీపీ ఆఫీసులో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల సంఖ్య ప్రస్తుతం 73 లక్షలకు చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇక సభ్యత్వ నమోదులో టాప్ -5లో రాజంపేట్, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి యువత, మహిళలు సభ్యత్వాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పార్టీలో ఉన్నామంటే కుదరదని, పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయనివారికి పదవులు కావాలని కోరడం సరికాదన్నారు. పదవులు వచ్చాయని కొందరు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పుకనే చెప్పేశారు సీఎం చంద్రబాబు.