Mohan Babu Case Update : జర్నలిస్టుపై దాడి ఘటనలో ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu)పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన తెలంగాణ హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించగా, మోహన్ బాబుకు చుక్కెదురైందని, ఆ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసిందని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి మోహన్ బాబు పరారీలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మోహన్ బాబు ఈ వార్తలపై స్పందించిన విషయం తెలిసిందే. అలాగే ఆయన విచారణకు ఎప్పుడు హాజరవుతారో కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
మోహన్ బాబు (Mohan Babu) సోషల్ మీడియా వేదికగా తాను ఎక్కడికి పారిపోలేదు అంటూ, తన అజ్ఞాతంపై వస్తున్న వార్తలు పై స్పందించారు. ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో “నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నా ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించినట్టుగా వార్తలు నడుస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను పారిపోలేదు, ప్రస్తుతం ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను” అంటూ ట్విట్ చేశారు.
తాజాగా అందుబాటులోకి వచ్చిన మోహన్ బాబు (Mohan Babu) ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేదని, కోలుకున్న తర్వాత విచారణకు హాజరవుతానని పోలీసులను కోరినట్టుగా సమాచారం. కానీ పోలీసులు మాత్రం ఇప్పుడే విచారణకు హాజరు కావాలని చెప్పడంతో పాటు, గన్ ను సరెండర్ చేయమని మోహన్ బాబును అడిగిట్టుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లోపు తన గన్ ను సరెండర్ చేస్తానని మోహన్ బాబు పోలీసులతో చెప్పారని అంటున్నారు.
ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్టుపై మోహన్ బాబు (Mohan Babu) దాడి చేసిన సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు మోహన్ బాబు – మంచు మనోజ్ వివాదం హీట్ నడుస్తున్న టైంలో ఇలాంటి ఘటన జరగడంతో జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. దీంతో ఘటనపై పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. ఈ ఘటనలో మోహన్ బాబుపై ముందుగా 118 (1) బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని, గురువారం 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు కూడా యాడ్ చేశారు. పైగా మోహన్ బాబు తన గన్ ను సరెండర్ చేయాలని ఆదశాలు జారీ చేశారు.
ఈ కేసులో భాగంగానే మోహన్ బాబు (Mohan Babu) ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో పోలీసులు తదుపరి విచారణ చేపట్టకుండా, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.. అయితే మోహన్ బాబు రిక్వెస్ట్ ను తిరస్కరించిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అప్పటి నుంచి మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.