AP Elections : వై నాట్ 175 ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తగ్గేదే లే అనేట్టు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో 175కి గాను 151 స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేని విజయం సాధించిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే సీనియర్, జూనియర్ అంటూ తేడా లేకుండా గెలుపు గుర్రాలకే సీట్లు కట్టబెడుతున్నారు సీఎం జగన్. టికెట్ రాని ఎమ్మెల్యేలకి నచ్చ చెప్పే బాధ్యతను జిల్లాల వారీగా పలువురు సీనియర్ నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇక రీసెంట్ గానే 11 మందితో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల జాబితాను రిలీజ్ చేయగా అందులో ముగ్గురు మంత్రులకు స్థానచలనం తప్పలేదు. అలాగే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. దాంతో రాబోయే లిస్టుల్లో ఎవరికి సీటు దక్కుతుందో ఉంటామో ఊడతామో అని నేతలంతా అయోమయంలో పడ్డారు. ఈ అభ్యర్ధుల మార్పు వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా కూడా మారింది. కాగా ఇప్పుడు తాజాగా మరో జాబితా విడుదలకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
రానున్న జాబితాలో గత జాబితా సంఖ్యకు రెట్టింపు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ దఫా రాయలసీమ పరిధిలోని అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ ఉంటుందని ఆ జాబితాలో కూడా సంచలన మార్పులుంటాయని సమాచారం. దీంతో రాయలసీమ వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకుంది. అయితే టికెట్ విషయమై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ కేటాయించని నేతలకు కొత్త అభ్యర్థిని గెలిపించే బాధ్యత అప్పగించి వారికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం హామీ ఇస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.