Vegetables Rates: మెుంథా తుపాను తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తుపాను దెబ్బకు కూరగాయల ధరలు సైతం కొండెక్కాయి. పలు నగరాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్కెట్‌కు సరకు తక్కువగా రావడంతో ధరలు అమాంతం పెరిగి పోయాయి.
మొన్నటి వరకూ కిలో రూ.10 ధర ఉన్న టమాటాలు ఇప్పుడు కిలో రూ.50 చేరింది. 25 కిలోలు బాక్స్ రూ.1000 ధర పలుకుతుంది. ఇంటి ముందుకు వచ్చే సరికి కిలో టమాటా రూ.60లకు పైగానే ధర పలుకుతుంది. మొంథా తుపాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో 171 ఎకరాల్లో కూరగాయ పంటలు నష్టం పోయాయి. టమాటాల కొరతతో వ్యాపారులు అనంతపురం, చిత్తూరు, మదనపల్లి, కర్నూలు, డోన్, కర్ణాటక చంతామణి, కోలారు ప్రాంతాలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
కార్తీక మాసం కావడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. గతంలో రోజుకు 1200 బాక్స్‌ల కూరగాయలు మార్కెట్‌కు రాగా, ప్రస్తుతం 800 బాక్స్‌లు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. వారం క్రితం టమాటా బాక్స్ ధర రూ.500 ఉండగా, ప్రస్తుతం రెట్టింపు అయిందంటున్నారు. మునగకాడలు దిగుబడి లేకపోవడంతో చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
Also Read: Buddha Venkanna: లిక్కర్ కేసులో జగన్‌తో లింక్స్ .. బుద్దా వెంకన్న సంచలనం
అయ్యప్ప భక్తుల అన్నదాన కార్యక్రమాలు పెరగడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 17,500 ఎకరాల నుంచి 30,000 ఎకరాల వరకు కూరగాయల సాగు చేస్తుంటారు. తుపాను వల్ల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో టమాటాకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గోరు చిక్కుడు కిలో రూ.25 నుంచి రూ.60కి పెరిగింది. చిక్కుడు కిలో రూ.80, వంకాయ కిలో రూ.70, కాకరకాయ కిలో రూ.50, బెండకాయ కిలో రూ.40, బీరకాయ కిలో రూ.70, బీన్స్ కిలో రూ.60, క్యాప్సికం రూ.60, క్యాబేజీ రూ.30, కొత్తి మీర రూ.30, పూదీన రూ.80 పలుకుతుంది. ఆలూ కిలో రూ.40కు చేరింది. ధరలు పెరగడంతో వినియోగదారుడి జేబుపై భారం పడుతుంది.