ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ముగిసి ఇప్పుడు సాంస్కృతిక సంబరాలు మొదలయ్యాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం విశేషం. జస్ట్ ఫొటో సెషన్ కి మాత్రమే వారిలో కొందరు హాజరయ్యారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు. దానవీర శూర కర్ణలో సుయోధనుడి పాత్రధారిగా ఆయన స్టేజ్ పై ఎన్టీఆర్ డైలాగులతో అదరగొట్టారు.
ఏమంటివి ఏమంటివీ..
ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశారో, ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో తెలియదు కానీ.. రఘురామ మాత్రం తన ఆహార్యం దగ్గర్నుంచి, డైలాగుల వరకు అన్నిటిలో తన మార్కు చూపించారు. ఈ ఏకపాత్ర గురించి గత కొన్నిరోజులుగా డిప్యూటీ స్పీకర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఇప్పుడు అందరి ముందు ప్రదర్శన ఇచ్చి ఔరా అనిపించారు. తన ప్రదర్శన అనంతరం ఆయన నేరుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్దకు వచ్చారు. వారితో కలసి గ్రూప్ ఫొటో దిగారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు. https://t.co/Esi5nSKp9W
— Telugu Desam Party (@JaiTDP) March 20, 2025
ఆ తర్వాత పల్నాటి వీర కిశోరం బాలచంద్రుడి పాత్రలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ స్టేజ్ పైకి వచ్చారు. ఆయనకూడా తన డైలాగులతో ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కరతాళ ధ్వనులతో ఆయన్ను అభినందించారు.
ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది. జగన్ ని టార్గెట్ చేస్తూ కొన్ని స్కిట్స్ ని ప్రదర్శించారు. జగన్ ఏ ఫంక్షన్ కి వెళ్లినా ఒకే ఎక్స్ ప్రెషన్ ఇస్తారని, ఆయన పార్టీలోని నేతలు బూతులు మాట్లాడతారని.. ఇలా రకరకాల ఉదాహరణలతో ఆయన్ను టార్గెట్ చేశారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేల విచిత్ర కోర్కెలు అంటూ మరో స్కిట్ ప్రదర్శించారు. చంద్రబాబు నలుగురు పిల్లల్ని కనమంటున్నారని.. కానీ టీడీపీ ఎమ్మెల్యేకి చెందిన ఓ పెళ్లి కొడుకు కాపురానికి రానంటున్నాడని, ఆయన్ను బతిమిలాడే బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉందంటూ సెటైరిక్ గా ఈ స్కిట్ సాగింది. నారాయణ, భాష్యం సంస్థల్లో కొందరు సీట్లు అడగడం, మరికొందరు పవన్ కల్యాణ్, బాలకృష్ణతో సినిమా అవకాశం ఇప్పించాలంటూ ఎమ్మెల్యేల సిఫార్సులు కోరడం కూడా ఇందులో ఉంది. మొత్తమ్మీద ఈసారి టీడీపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో ఇందులో చూపించారు.
మొత్తమ్మీద సాంస్కృతిక కార్యక్రమాల్లో కొందరు నేతలు తమ ఏకపాత్రాభినయంతో ఆకట్టుకుంటే, మరికొందరు ప్రస్తుత తమ పరిస్థితిని స్టేజ్ పై వివరించారు. జగన్ పై పంచ్ లు వేస్తూ సాగిన స్కిట్ కి మాత్రం అన్నిటికంటే ఎక్కువ స్పందన వచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ నవ్వుతూ కనిపించారు. జగన్ పై పంచ్ లు పడుతుంటే.. టీడీపీ నేతలంతా చప్పట్లుకొట్టారు. అయితే మహిళా శాసన సభ్యులు ఉన్నా కూడా కొన్నిచోట్ల సెన్సార్ డైలాగులు వినిపించడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.