Drug Mounjaro in India : భారత్ లోని పెద్దలు, యువతలో చాలా మంది డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టైప్ -2 డయాబెటిస్ చాలా సాధారణంగా మారిపోయింది. ఈ కారణంగా.. దాదాపు 77 మిలియన్ల మంది బాధపడుతున్నారు. అలాగే.. ఉభకాయం కారణంగా దేశంలోని యువత, చిన్నారులు సహా పెద్దలకు అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇలాంటి వారికి భారీ ఊరట కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. వీరి సమస్యలకు పరిష్కారంగా.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఔషధానికి భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ – సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి సైతం లభించింది. ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన ఔషధ దిగ్గజం ఎలి లిల్లీ.. మౌంజారో పేరుతో భారత్ లో ప్రవేశపెట్టనుంది.
మౌంజారో టైప్ 2 డయాబెటిస్, డయాబెటిస్ మెల్లిటస్ తో పాటుగా అధిక బరువును నియంత్రించేందుకు ఉపయోగించనున్నారు. ఈ ఔషధం ప్రస్తుతానికి సింగిల్-డోస్ సీసాలో అందుబాటులో రానుంది.. ఇది రెండు కీలక హార్మోన్లు, GIP- గ్లూకోజ్-ఆధారిత ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్, GLP-1 -గ్లూకాగాన్ లాంటి పెప్టైడ్-1ను యాక్టివేట్ చేయడం ద్వారా పనిచేస్తుందని.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని డాక్టర్ల సిఫార్సు మేరకు అందించనున్నారు.
మధుమేహం, ఊబకాయాన్ని నియంత్రించేందుకు GLP-1 తరగతి ఔషధాలకు డిమాండ్ బాగా పెరిగింది. బాధితులు పెరుగుతుండడం, ఈ ఔషధ వినియోగం ఎక్కువ అవడంతో అంతర్జాతీయంగా వందల బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ ఏర్పడింది. ఈ తరగతిలోని కీలకమైన ఔషధం సెమాగ్లుటైడ్ వచ్చే ఏడాది మార్చిలో ఆఫ్-పేటెంట్ పొందనుంది. దీంతో.. ఈ ఔషధాన్ని పేటెంట్ సంస్థ నుంచి అనుమతులు అవసరం లేకుండానే ఏ ఫార్మా సంస్థలైనా తయారు చేసుకునే వెసులుబాటు కలగనుంది. దీంతో.. మ్యాన్‌కైండ్ ఫార్మా, ఆల్కెమ్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌తో సహా అనేక భారతీయ సంస్థలు ఈ ఔషధానికి జెనరిక్ వెర్షన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
కాగా.. ప్రస్తుతం భారత్ లోని అందుబాటులోకి వచ్చిన టైప్ -2 డయాబెటిస్, ఒబేసిటీ కంట్రోల్ వ్యాక్సిన్ ను నియంత్రిత క్లినికల్ ట్రయల్‌లో మంచి పౌష్టికాహారం, వ్యాయామంతో పాటుగా తీసుకుంటే.. పెద్దలు 72 వారాలలో సగటున అత్యధిక మోతాదు (15 mg) వద్ద 21.8 కిలోలు, అత్యల్ప మోతాదు (5 mg) వద్ద 15.4 కిలోల బరువు తగ్గినట్లుగా తేలింది.
Also Read : Symptoms Of Prediabetes: ప్రీ డయాబెటిస్ లక్షణాలివే.. ఇలా చేస్తే షుగర్ రాకుండా ఉంటుందట !
భారత్ లో స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్ రెండూ ప్రజారోగ్యానికి ప్రధాన సవాలుగా మారాయి. ఈ వ్యాధులపై అవగాహనను కల్పించేందుకు, నివారణ కోసం ప్రభుత్వం, ఫార్మా పరిశ్రమలతో సహకరించేందుకు లిల్లీ సంస్థ కట్టుబడి ఉందని లిల్లీ ఇండియా అధ్యక్షుడు, జనరల్ మేనేజర్ విన్సెలో టక్కర్ వెల్లడించారు. జనవరి 2022లో భారత్ లో ప్రారంభించిన నోవో నార్డిస్క్ ఓరల్ సెమాగ్లుటైడ్ టాబ్లెట్, రైబెల్సస్, ఇప్పటికే యాంటీ-ఒబెసిటీ డ్రగ్ మార్కెట్‌లో దాదాపు 65 శాతం వాటాను ఆక్రమించింది. ఇందులో డ్యూలాగ్లుటైడ్, ఆర్లిస్టాట్, లిరాగ్లుటైడ్ వంటి ఇతర బరువు తగ్గించే మందులు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలో యాంటీ-ఒబెసిటీ డ్రగ్స్ మార్కెట్ విపరీతమైన వృద్ధి నమోదు చేసింది. నవంబర్ 2020లో రూ.137 కోట్ల నుంచి నవంబర్ 2024లో రూ.535 కోట్లకు మార్కెట్ విస్తరించినట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అలాగే.. ఇండియాలో దాదాపు 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా వీరిలో దాదాపు సగం మందికి సబ్‌ఆప్టిమల్ గ్లైసెమిక్ నియంత్రణతో కావాల్సిన వైద్యం అందడం లేదని అంటున్నారు. కాగా.. దీర్ఘకాలంలో తిరగబెట్టడం, మధుమేహానికి ప్రధాన ప్రమాద కారకమైన ఊబకాయం, రక్తపోటు, డిస్లిపిడెమియా, కరోనరీ హార్ట్ డిసీజ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో సహా 200 కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. కాగా.. 2023 నాటికి దేశంలో వయోజన ఊబకాయం దాదాపు 6.5 శాతంగా ఉంది. ఇది దాదాపు 100 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది.
Also Read : World Oral Health Day 2025: పంటి ఆరోగ్యం కోసం.. వీటికి తినకుండా ఉండండి !
ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలి
అమెరికాకు చెందిన ఎలి లిల్లీ తయారు చేసిన మౌంజారో ఔషధాన్ని వారానికి ఒకసారి తీసుకునే ప్రిస్క్రిప్షన్ ఆధారిత ఔషధం. ఇది సహజ ఇన్‌క్రెటిన్ హార్మోన్లు అయిన GIP, GLP-1 లపై పని చేస్తుంది. గ్లూకోజ్-ఆధారిత పద్ధతిలో, మౌంజారో మొదటి-దశ, రెండో-దశ ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గ్లూకాగాన్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంతో పాటుగా గ్యాస్ట్రిక్ సమస్యను ఆలస్యం చేస్తుందని అంటున్నారు. మౌంజారో వ్యాక్సిన్ కారణంగా ఆహారం తీసుకోవడం, శరీర బరువును తగ్గిస్తుందని, ఆకలిని నియంత్రించడం ద్వారా కొవ్వును తగ్గిస్తుందని చెబుతున్నారు.